అది మహిళల సంరక్షణ కోసం పెట్టిన గృహం.. న్యాయస్థానం ఆదేశాలతో ఆ హోమ్‌లో సంరక్షిస్తుంటారు. అయితే అక్కడ నుంచి ఆరుగురు యువతులు పరారయ్యారు. అది కూడా మామూలుగా కాదు, పక్కా ప్లాన్ తో..! అక్కడ ఉన్న సిబ్బందికి భయపెట్టి బెదిరించి మరీ.. సినీ స్టైల్ లో జరిగిన ఈ ఘటన ఉలిక్కిపడేలా చేసింది..!
విశాఖపట్నంలోని పెందుర్తి ఆదిత్యనగర్‌లో బాధిత మహిళల కోసం సంరక్షణ గృహం నిర్వహణ జరుగుతుంది. శక్తి సదన్ పేరుతో ఉన్న ఈ హోమ్‌ను సీడ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. ఇక్కడ నుంచి ఇటీవల ఓ యువతి పరారైంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి పారిపోయి నెల రోజులు గడవక ముందే, మరో ఆరుగురు పారిపోయారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మహిళలు బాధితులుగా ఉన్నారు. న్యాయస్థానం ఆదేశాలతో ఆ ఆరుగురు స్వధార్ హోమ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హోమ్ ఇంచార్జి లింగమ్మకు వంట పనుల్లో సాయం చేసేవారు. ఏదో సాయంలా ఉన్నారు అనుకుంది ఆ లింగమ్మ. వాళ్లతో చనువుగా మాట్లాడేది. అదే వాళ్లకు కలిసి వచ్చింది. ఒక్కసారిగా ఆ ఆరుగురు యువతులు ప్రవర్తన మారింది. లింగమ్మకు ముగ్గురు యువతులు పట్టుకుని ఆమె చేతులు వెనక్కు విరిచారు. కళ్లలో కారం కొట్టారు. కూరగాయలు తరిగే చాకుతో బెదిరించి, ఆమె సెల్‌ఫోన్ లాక్కున్నారు. మూడో కంటికి తెలియకుండా అక్కడ నుంచి పారిపోయారు. కాసేపటికి లింగమ్మ తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనుమానాలు..
అయితే సినీ స్టైల్ లో జరిగిన ఈ ఘటనపై అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మహిళలు పారిపోయే సందర్భాలు గతంలో చాలాసార్లు జరిగాయి. గత నెలలోనే బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ పారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఆరుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పరారయ్యారు. అయితే అక్కడ సీన్ ఆఫ్ అపెన్స్ తోపాటు.. సీసీ కెమెరాలు కూడా వైర్లు కత్తిరించి ఉండటంతో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..