Andhra Pradesh: గ్రామ సచివాలయానికి తాళం వేసేశారోచ్‌.. మూడేళ్లుగా యజమానికి ముప్పుతిప్పలు..!

| Edited By: Jyothi Gadda

Oct 13, 2023 | 6:38 PM

Ongole: ఎప్పటిలాగే సిబ్బంది యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించడానికి వెళ్లగా అక్కడ సచివాలయ భవనానికి తాళం వేసి ఉంది.. దీంతో సిబ్బందికి ఏమి చేయాలో అర్థంకాక బయట కూర్చున్నారు. కొంతసేపు తర్వాత సిబ్బంది అంతా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు.

Andhra Pradesh: గ్రామ సచివాలయానికి తాళం వేసేశారోచ్‌.. మూడేళ్లుగా యజమానికి ముప్పుతిప్పలు..!
Secretariat Building
Follow us on

ఒంగోలు, అక్టోబర్13; అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం వేశాడు ఇంటి యజమాని… మూడేళ్ళుగా అద్దె చెల్లించకుండా తన ఇంట్లో సచివాలయం నిర్వహిస్తున్నారని, అయితే మూడు లక్షల వరకు అద్దె రావాల్సి ఉండగా ఇక చేసేది లేక సచివాలయానికి తాళం వేసి తన నిరసన వ్యక్తం చేశాడు… దీంతో సచివాలయం సిబ్బంది గేటు బయటే కాలక్షేపం చేయాల్సి వచ్చింది… విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళడంతో ఆయన రంగంలోకి దిగాల్సి వచ్చింది… వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి అద్దె చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సచివాలయం తాళం తీశాడు ఆ ఇంటి యజమాని…

అద్దె చెల్లించలేదని సచివాలయానికి భవన యజమాని తాళం వేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కొనకనమిట్ల గ్రామంలో సచివాలయం ప్రారంభం నుంచి ఇక్కడ అద్దె భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే మూడేళ్లుగా అద్దె చెల్లించడం లేదని భవనం యజమాని తిరుపతిరెడ్డి పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లనా ఫలితం లేకపోయింది.. ఇక చేసేదేమీ లేక భననానికి తాళం వేశాడు. ఎప్పటిలాగే సిబ్బంది యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించడానికి వెళ్లగా అక్కడ సచివాలయ భవనానికి తాళం వేసి ఉంది.. దీంతో సిబ్బందికి ఏమి చేయాలో అర్థంకాక బయట కూర్చున్నారు. కొంతసేపు తర్వాత సిబ్బంది అంతా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు.

మూడేళ్లు అద్దె ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని యజమాని ప్రశ్నిస్తున్నాడు… నెలకు 9 వేల చొప్పున అద్దెకు ఇస్తే.. అదిగో ఇదిగో అని సాకులు చెబుతున్నారే తప్ప డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో అద్దె చెల్లించేందుకు చర్యలు తీసుకునేలా చూస్తానని ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి హామీ ఇవ్వడంతో యజమాని తిరుపతిరెడ్డి సచివాలయం తాళాలు తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..