ఎస్సీ, ఎస్టీల సాధికారితకు జనసేన కట్టుబడి ఉందన్నారు జనసేన అధినేత పవన్. 22 శాతం జనాభా ఉన్నా నిధుల కోసం ఇంకా దేహి అనాల్సిన పరిస్థితి ఉండటం దారుణమన్నారు. రాక్షస పాలన నుంచి APని విడిపించడమే వారాహి లక్ష్యమన్నారు పవన్. SC, ST సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లించకూడదని, అది సంపూర్ణంగా అమలు జరగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 22 శాతం జనాభా ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని కోరాలా..? అని ప్రశ్నించారు. అన్ని కులాలకు చేయూత అందించాలి.. నమ్ముకున్న వారికి ఏదో ఒకటి చేయాలన్నారు. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే, సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే తన తపన అన్నారు పవన్. మంగళగిరిలో పార్టీ ఆఫీసులో జరిగిన సదస్సులో ఆయన వైసీపీ వైఫల్యాలపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు పవన్‌కళ్యాణ్.
వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో..అంతే ప్రమాదకరమన్నారు పవన్‌కళ్యాణ్. వివక్షకు గురైనప్పుడే ఆ బాధ తెలుస్తుందని, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారన్నారు. వివక్షకు గురయ్యే కులాలను మనం అర్థం చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని తెలిపారు పవన్. ఈ మూడేళ్లలో 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు? ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం 15 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారాయన.
అంతకుముందు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, ఆ తర్వాత వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే వారాహి లక్ష్యమన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..