Sajjala Ramakrishna Reddy Press meet: వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంటగంటకు మాట మార్చడం చంద్రబాబుకు అలవాటన్నారు. బీజేపీని తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపిస్తున్నారంటూ సజ్జల బాబుపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు జగన్ పాలనను కోరుకుంటున్నారన్నారు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్‌లా మారిపోయారని అన్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతిభవన్‌లో నీచరాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని పిలవకుండా అవమానించారని అన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు రెండోసారి వెన్నుపోటీ పొడిచారంటూ సజ్జల విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని నందమూరి కుటుంబ సభ్యులు అవమానించారని, ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయ వేదికగా మార్చారంటూ సజ్జల పేర్కొన్నారు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని, నాడు తన పక్కన ప్రచారంలో కూడా నిలబెట్టుకున్నారని.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెను ఆమోదించారంటూ పేర్కొననారు. కానీ, లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్‌కు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని.. 2024లో అధికారంలోకి వస్తే ఏదో చేస్తానంటున్నారని.. అసలు 2019 వరకు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రజలందరికీ తెలుసునన్నారు. తాము పవన్ కల్యాణ్‌తో లేమని, బీజేపీతో ఉండమని చెబితే లోకేశ్ పాదయాత్రకు అంతమంది జనాలు వస్తారా అంటూ సజ్జల పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు కార్యకర్తలే రావడం లేదంటూ విమర్శించారు. పొత్తుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని.. బీజేపీ, టీడీపీ కలవాలనుకుంటే ఎవరు ఆపుతారన్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసినా ఫర్వాలేదంటూ పేర్కొన్నారు. ఇప్పటికీ.. చంద్రబాబు 175 చోట్ల సొంతంగా పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారన్నారు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్‌లా మారారని.. బాబు నాడు మోదీని తిట్టి ఇప్పుడు పొగుడుతున్నారంటూ సజ్జల విమర్శించారు.
పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు. వీరంతా ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నారని, కానీ అసలు ఆ వ్యతిరేకత ఉందా.. అంటూ సజ్జల ప్రశ్నించారు. తమకు 70 శాతం పాజిటివ్ ఓటు బ్యాంకు ఉందని.. మిగతా 30 శాతాన్ని ప్రతిపక్షాలు పంచుకుంటాయంటూ సజ్జల జోస్యం చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..