AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: గుంటూరు వెస్ట్.. రెండు పార్టీల్లోనూ ఇప్పుడిదే హాట్ సీట్.. ఎందుకు అలా..?

అదృష్టం కలిసొస్తే... అవకాశం..వస్తే అక్కడినుంచే పోటీకి వారంతా సిద్ధంగా ఉన్నారు. ఒకరిద్దరు కాదు ముగ్గురు నలుగురు ఆ సీటుపై కన్నేశారు. కానీ అధిష్టానం మాత్రం క్యాస్ట్‌ ఈక్వేషన్‌తోనే క్యాండేట్‌ని ఫైనల్‌ చేయాలనుకుంటోంది. దీంతో ఇప్పటినుంచే అధికార పార్టీలో ఆ సీటు చుట్టూ నేతల వ్యూహాత్మక ఎత్తుగడలు మొదలయ్యాయి. అటు ప్రతిపక్షం నుంచి కూడా ఆశావహులు తెరపైకొస్తున్నారు. కాని అధిష్ఠానం ఇంకా ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదంటున్నారు.

AP News: గుంటూరు వెస్ట్.. రెండు పార్టీల్లోనూ ఇప్పుడిదే హాట్ సీట్.. ఎందుకు అలా..?
YSRCP vs TDP
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2023 | 7:04 PM

Share

గుంటూరు జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ ఒకటి. ఇక్కడినుంచి పోటీకి టీడీపీ, వైసీపీల్లో చాలామంది నేతలు మేం రెడీ అంటున్నారు. జిల్లాకేంద్రంలో కీలకమైన ఆ సీటుపై నేతలు గట్టిగానే గురిపెట్టారు. అధికార పార్టీలో గుంటూరు వెస్ట్‌ సీటుకు పోటీ ఎక్కువగా ఉంది. కమ్మ, కాపు సామాజిక ఓటర్లు కీలకమైన ఈ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరికివారు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీనుంచి గెలిచిన మద్దాలి గిరి తర్వాత వైసీపీకి జై కొట్టారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన గిరి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీనుంచి పోటీకి సిద్ధమయ్యారు. కచ్చితంగా టికెట్‌ తనకేనన్న నమ్మకంతో ఉన్నారు సిట్టింగ్‌ ఎమ్మెల్యే. కానీ గిరి ఆశలు ఎంతవరకు నెరవేరతాయో చెప్పలేమన్నట్లుంది సిట్యువేషన్‌. ఎందుకంటే అధికారపార్టీనుంచే మరికొందరు ముఖ్యనేతలు పశ్చిమ సీటుపై కన్నేశారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంనుంచి గత ఎన్నికల్లో బీసీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు ఏసురత్నం. ఓటమి తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీ చేసి ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఓసీ కోటాలో అవకాశం వస్తే పశ్చిమ నుంచి పోటీకి సిద్ధమంటున్నారు అప్పిరెడ్డి. గట్టి అనుచరగణం ఉన్న అప్పిరెడ్డి ఆశీస్సులు లేకుండా.. గుంటూరు వెస్ట్‌లో విజయం కష్టమంటున్నాయ్‌ వైసీపీ శ్రేణులు. ఇక పశ్చిమసీటుపై ఆశలుపెట్టుకున్న మరో నాయకుడు.. మేయర్ కావటి మనోహర్ నాయుడు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆ కోటాలో టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమంటున్నారు కావటి. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన శనక్కాయల అరుణ, కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు గుంటూరు వెస్ట్‌లో గెలిచారు. తనకు అవకాశం ఇస్తే వెస్ట్‌లో గెలుపు ఖాయమన్నది మేయర్‌ ఈక్వేషన్‌.

వైసీపీ నేతలు ఎవరి లెక్కల్లో వారున్నా.. అధినాయకత్వం ఆలోచనలు మరోలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. వెస్ట్‌నుంచి బీసీనే బరిలోకి దించే ఆలోచనలో ఉందట వైసీపీ నాయకత్వం. యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలు ఎవరినైనా ఇతర పార్టీల నుంచి తీసుకొని చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో కాంబినేషన్‌లో కమ్మ సామాజికవర్గానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరగుతోందట. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం కూడా కీలకంగా ఉంది. గుంటూరు జిల్లాలో ఒక్క తెనాలిలోనే ఆ వర్గానికి వైసీపీ అవకాశం ఇచ్చింది. ఈసారి కమ్మ సామాజికవర్గానికి మరో టికెట్‌ ఇవ్వాలనుకుంటే అది గుంటూరు పశ్చిమ నియోజకవర్గమే కావచ్చన్న ప్రచారం పార్టీలో బలంగా ఉంది.

వైసీపీ లెక్కలు ఇలా ఉంటే.. గత ఎన్నికల్లో గెలుచుకున్న పశ్చిమ విషయంలో టీడీపీలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటిదాకా పశ్చిమనుంచి పోటీచేసే అభ్యర్థి విషయంలో ప్రతిపక్షపార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటంతో సైకిల్‌ పార్టీలోనూ ఆశావహులు తెరపైకొస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా ఉన్న కోవెలమూడి నాని టికెట్ తనకేనని చెప్పుకుంటున్నారు. కాని అధిష్ఠానం ఇంకా ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదంటున్నారు టీడీపీ ఆశావహులు. మొత్తానికి పూర్తి నగర వాతావరణంలోఉండే పశ్చిమ నియోజకవర్గం టికెట్‌కి రెండుపార్టీల్లో ఈసారి గట్టి కాంపిటీషనే ఉంది. నాయకుల ఆశలు అంచనాలు ఎలా ఉన్నా.. పార్టీ అధినాయకత్వాల ఆలోచనలే ఇంకా ఎవరికీ అంతుపట్టటంలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..