రక్త పింజర్లు ఎక్కువ ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి..? వాటికి ఇష్టమైన ఆహారం ఏంటంటే
రక్త పింజర్లు (రస్సెల్స్ వైపర్) ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి? వాటికి ఇష్టమైన ఆహారం ఏంటి? గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను కనే ఈ విషపూరిత పాము ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందో శాస్త్రీయ కారణాలతో తెలుసుకుందాం. ఇది రైతులకు ఉపయోగకరమైన కథనం ..

వ్యవసాయ పొలాల్లో తరచూ కనిపించే అత్యంత విషపూరిత పాముల్లో రస్సెల్స్ వైపర్ ఒకటి. తెలుగులో చాలా ప్రాంతాల్లో దీనిని రక్త పింజర్లు అని పిలుస్తారు. దేశంలో పాముకాట్ల వల్ల సంభవించే మరణాల్లో ఈ పాము కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే మనిషిని కావాలనే వెంబడించే స్వభావం దీనికి ఉండదు. ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రమే ఇది దాడి చేస్తుంది. రైతులు, వ్యవసాయ కూలీలు, అడవుల్లో సంచరించే వారు ఈ పాము గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
రక్త పింజర్లు ప్రధానంగా వ్యవసాయ పొలాలు, గడ్డి పొదలు, పొదలతో కూడిన ఖాళీ భూములు, రాతి ప్రాంతాలు, పొలాల గట్లు, కాలువల పరిసరాలు, గ్రామాల శివార్లు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ, మిరప వంటి పంటలు పండించే ప్రాంతాల్లో ఇవి తరచూ కనిపిస్తుంటాయి. ఇందుకు ప్రధాన కారణం అక్కడ ఎలుకలు అధికంగా ఉండటమే. పగటి సమయంలో ఇవి ఎక్కువగా రాళ్ల కింద, పొదల్లో, ఎండిన ఆకుల మధ్య లేదా ఎలుకల బొరియల దగ్గర దాక్కుని ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటకు వస్తాయి.
ఈ పాముకు ఎలుకలే అత్యంత ఇష్టమైన ఆహారం. ఎలుకలు అధికంగా ఉండే పొలాలు, ధాన్య గోదాములు, నిల్వ కేంద్రాల పరిసరాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తాయి. ఎలుకలతో పాటు చిన్న పక్షులు, కప్పలు, బల్లులు, ఇతర చిన్న క్షీరదాలను కూడా వేటాడతాయి. చిన్న వయసులో ఉన్న రక్త పింజర్లు ఎక్కువగా కప్పలు, బల్లులను తింటే, పెద్దవైన తర్వాత ప్రధానంగా ఎలుకలపైనే ఆధారపడతాయి. వ్యవసాయానికి నష్టం చేసే ఎలుకల సంఖ్యను నియంత్రించడంలో ఇవి ప్రకృతిలో ఒక ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తాయి.
రక్త పింజర్లు ఎక్కువగా కనిపించడానికి మరో ప్రధాన కారణం వాటి సంతానోత్పత్తి విధానం. చాలా పాముల్లా గుడ్లు పెట్టకుండా, ఈ జాతి నేరుగా పిల్లలను కంటుంది. శాస్త్రీయంగా దీనిని వివిపరస్ జాతి అంటారు. సాధారణంగా ఒక ఆడ రక్త పింజర్లు ఒకేసారి 20 నుంచి 40 పిల్లలకు జన్మనిస్తుంది. అనుకూల పరిస్థితుల్లో 50 నుంచి 60 వరకు, అరుదుగా 70–80 పిల్లలు కూడా పుట్టినట్లు శాస్త్రీయ పరిశోధనల్లో నమోదైంది. పుట్టిన పిల్లలు మొదటి రోజు నుంచే స్వతంత్రంగా జీవించగలుగుతాయి. వాటికి పుట్టుకతోనే విషగ్రంథులు పనిచేస్తాయి కాబట్టి చిన్న కప్పలు, బల్లులు, ఎలుక పిల్లలను వేటాడడం ప్రారంభిస్తాయి.
అయితే ఎక్కువ పిల్లలు పుట్టినంత మాత్రాన అన్నీ పెద్దవిగా ఎదగవు. గద్దలు, గుడ్లగూబలు, ముంగిసలు, ఇతర పాములు, అడవి జంతువుల వేటకు అనేక పిల్లలు బలవుతాయి. అయినప్పటికీ ఒకేసారి ఎక్కువ పిల్లలు పుట్టడం వల్ల ఈ జాతి జనాభా కొనసాగుతూ ఉంటుంది. దీనికి తోడు పొలాల్లో ఎలుకలు సమృద్ధిగా లభించడం, ఆశ్రయం కల్పించే పొదలు, గట్లు, రాళ్ల కుప్పలు ఉండటం కూడా వీటి సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది.
రక్త పింజర్లు ప్రమాదాన్ని గుర్తిస్తే తన శరీరాన్ని వలయాకారంలో ముడుచుకుని గట్టిగా బుసకొడుతుంది. ఆ తర్వాత కూడా ప్రమాదం తొలగకపోతే అత్యంత వేగంగా దాడి చేస్తుంది. దీని విషం రక్తం గడ్డకట్టే వ్యవస్థ, కణజాలం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల రక్త పింజర్లు కాటు పడితే ఎలాంటి ఇంటి వైద్యం చేయకుండా బాధితుడిని ప్రశాంతంగా ఉంచి వీలైనంత త్వరగా సమీప ఆస్పత్రికి తరలించి యాంటీ స్నేక్ వెనం చికిత్స అందించడం అత్యంత కీలకం.
ప్రకృతిలో రక్త పింజర్లు ఒక ముఖ్యమైన జీవి. ఎలుకల వంటి పంటలకు హాని చేసే జంతువుల సంఖ్యను నియంత్రించడం ద్వారా వ్యవసాయ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ పాము కనిపించినప్పుడు దాన్ని చంపేందుకు ప్రయత్నించకుండా, సురక్షిత దూరంలో ఉండి అటవీశాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ బృందాలకు సమాచారం ఇవ్వడం ఉత్తమ మార్గం.
