Sankranti Festival: అంబరాన్నంటిన సంక్రాంతి సంబురం.. కత్తులు దూసిన కోళ్లు.. చేతులు మారిన కోట్లు

|

Jan 14, 2025 | 9:05 PM

సంక్రాంతి అంటే బంధుమిత్రుల అనుబంధాలు, అప్పాలు, ప్రభలు, సినిమాలే కాదు.. కోళ్లు, కోట్లు, పేకాటలు, గుండాటలు కూడా. భోగి రోజు ఏకంగా 300 కోట్ల రూపాయల పందేలు జరిగితే.. సంక్రాంతి నాడు అంతకు రెట్టింపు జరిగింది. ఇక కనుమ, ముక్కనుమ కూడా కలుపుకుంటే కనీసం 3వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయని అంచనా వేస్తున్నారు.

Sankranti Festival: అంబరాన్నంటిన సంక్రాంతి సంబురం.. కత్తులు దూసిన కోళ్లు.. చేతులు మారిన కోట్లు
Cockfighting
Follow us on

కోడిపందేలు, గుండాటలు, పేకాటల్లో ఎన్ని కోట్లు చేతులు మారతాయో లెక్కగట్టి చెప్పేందుకు ప్రత్యేకంగా మనుషులేం ఉండరు. కాకపోతే.. ఒక్కో బరిలో తీస్తున్న నోట్ల కట్టలు, పెడుతున్న పందేలను చూస్తే.. ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో అంచనా వేయొచ్చు. ఈ రెండ్రోజుల్లోనే.. అంటే భోగి, సంక్రాంతికి కలిపి కనీసం వెయ్యి కోట్ల రూపాయల దాకా చేతులు మారి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కోడిపందేలు భోగి, సంక్రాంతి, కనుమల్లోనే కాదు.. పండక్కి వారం ముందే మొదలవుతాయి. పండగ తరువాత కూడా నడుస్తుంటాయి. ఈ లెక్కన పోయిన ఏడాది ఏకంగా 3వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈసారి సంక్రాంతి సీజన్‌లో 3వేల కోట్లు దాటుతుందని అంచనా..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో భోగి నాడే 175 కోట్ల రూపాయల పందేలు జరిగినట్టు చెబుతున్నారు. ఇక మొత్తం గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో జరిగే కోడిపందేలను కూడా లెక్కేస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. కృష్ణా జిల్లాలో అతిపెద్ద బరిగా ఉన్న అంపాపురంలో ఏకంగా 10 కోట్లకు పైన పందేలు జరిగినట్టు చెబుతున్నారు. పైగా ఈసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకుల చేతుల మీదుగా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. దీంతో.. చాలాచోట్ల పోలీసులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు. ఈసారి ఏపీ సరిహద్దున ఉన్న తెలంగాణ జిల్లాల్లోనూ జోరుగా కోడిపందేలు జరిగాయి. భోగికి ముందే తెలంగాణలోని ఆంధ్రా సరిహద్దుల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి.

ఈసారి పందాల్లో ట్రెండ్‌ మార్చారు.. లక్షల విలువైన బహుమతులను సైతం ప్రకటించారు. కోడిపందేల్లో గెలిచిన వారికి మహీంద్రా థార్‌ కారు, బుల్లెట్‌ బండ్లు, యూనికార్న్‌ బైక్‌లను గిఫ్టులుగా ఇస్తున్నారు. పందేలు ఆడ్డానికి కోళ్లతో వచ్చిన కొందరు బైక్‌లు గెలిచి రయ్‌మంటూ ఇళ్లకెళ్లారు. అలాగని డబ్బులు ఇవ్వరని కాదు. పందెంలో గెలిచిన డబ్బులతో పాటు బైక్‌లు, కార్‌ కూడా గిఫ్ట్‌గా ఇస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ పందేలు జరిపిస్తే.. నిర్వాహకులకు కూడా ఎక్కువ కమిషన్‌ వస్తుంది. అందుకే, ఈ ప్లాన్‌ వేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..