AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల వెంకన్నకు ఉన్న బంగారం ఎంతో తెలుసా..? విలువ లెక్కకడితే..

తిరుమలేశుడిపై భక్తుల భక్తి మరలా రుజువైంది. గత 11 నెలల్లోనే టీటీడీ ట్రస్ట్‌లకు రూ.918 కోట్లకు పైగా విరాళాలు చేరాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దాతలు సమర్పిస్తున్న కానుకల వెల్లువతో స్వామి ఖజానా మరింతగా నిండిపోతోంది. ఈ కథనంలో పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Tirumala: తిరుమల వెంకన్నకు ఉన్న బంగారం ఎంతో తెలుసా..? విలువ లెక్కకడితే..
Tirumala
Raju M P R
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 23, 2025 | 5:57 PM

Share

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అపర కుబేరుడు, బంగారు స్వామి. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, వేల కోట్ల విలువైన ఆస్తులతో దేశ విదేశాల భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్వామి ఆస్తుల విలువ మరింతగా పెరుగుతోంది. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా ప్రతి భక్తుడు సమర్పించే కానుకలు, దాతలు ఇచ్చే విరాళాలు.. ఇవన్నీ తిరుమలేశుడి ఖజానాను నింపుతున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అందుతున్న విరాళాల వెల్లువతో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరిగింది.

ఇప్పటికే టీటీడీ వద్ద సుమారు రూ. 21 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దాదాపు 12 వేల కిలోల స్వచ్ఛమైన బంగారం జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌గా ఉన్నాయి. అంటే గ్రాము పదివేల చొప్పున లెక్కకడితే  రూ. 1.2 లక్షల కోట్లు ఉన్నట్లు అవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన కొత్త టీటీడీ పాలకమండలి పదవీ కాలం 11 నెలలు పూర్తవుతున్న వేళ.. ఈ వ్యవధిలోనే రికార్డు స్థాయిలో విరాళాలు చేరాయి. 2024 నవంబర్ 1 నుంచి 2025 అక్టోబర్ 16 వరకు భక్తులు, దాతలు టీటీడీ వివిధ ట్రస్ట్‌లకు సమర్పించిన విరాళాల మొత్తం రూ. 918.6 కోట్లు.

Also Read: చేప అనుకుని చేతుల్తో పట్టి ఒడ్డున వేశారు.. తీరా చూస్తే.. ఓర్నాయనో..

ట్రస్ట్‌లవారీగా పరిశీలిస్తే.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు అత్యధికంగా రూ. 338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ. 252.83 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ. 97.97 కోట్లు, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 66.53 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ. 56.77 కోట్లు, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ. 33.47 కోట్లు, బర్డ్ ట్రస్ట్‌కు రూ. 30.02 కోట్లు, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు రూ. 20.46 కోట్లు, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్‌కు రూ. 13.87 కోట్లు, ఎస్వీబీసీకు రూ. 6.29 కోట్లు, స్విమ్స్‌కు రూ. 1.52 కోట్లు విరాళాలుగా అందాయి. వీటిలో ఆన్‌లైన్ ద్వారా రూ. 579.38 కోట్లు, ఆఫ్‌లైన్ ద్వారా రూ. 339.20 కోట్లు విరాళాలు చేరినట్లు టీటీడీ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

భక్తులు, దాతల విశ్వాసానికి తగ్గ గౌరవం, సేవలు అందించడంలో ఎక్కడా లోటు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. దాతల సహకారంతో ఆలయంలో పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.