రైలు ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో కీలక మార్పులు!
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. త్వరలో మరిన్ని కొత్త సర్వీసులు, వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ఇప్పుడు ఆరెంజ్ రంగులో, 20 బోగీలతో ప్రత్యేకంగా మారింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు బోగీలు పెంచారు.

భారతీయ రైల్వేల్లో ప్రత్యేకంగా నిలుస్తున్న వందే భారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే పలు సర్వీస్‌లు విజయవంతంగా నడుస్తుండగా త్వరలోనే మరిన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వాటిని తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు మరో సర్వీసును వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య కొనసాగుతున్న వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి టు సికింద్రాబాద్ వందేభారత్ రైలు మంగళవారం మినహా ప్రతి రోజు అందుబాటులో ఉంటోంది. దీంతో ఇదే మార్గంలో వందేభారత్ స్లీపర్ సైతం కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై రైల్వే శాఖ తుది నిర్ణయం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా తిరుపతి టు సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఇప్పుడు ఆరెంజ్ కలర్‌లోకి మారనుంది. కొత్తగా ఆరెంజ్ రంగులో 20 బోగీల రైలుగా మారింది. ఇందులో 1,440 సీట్లు ఉంటాయి. 102 వందేభారత్ రైళ్లలో ఈ రైలు మాత్రమే ప్రత్యేకంగా ఆరెంజ్ కలర్‌లో నడుస్తుండడం విశేషం.
ఈ రైలును 2023 ఏప్రిల్ 9న ప్రారంభించారు. అప్పుడు తెలుపు రంగులో ఉండేది. కొన్ని నెలలపాటు 8 బోగీలతో నడిచింది. డిమాండ్ పెరగడంతో 20 బోగీలకు పెంచారు. ఈ రైలులో 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16బోగీలతో నడుస్తున్న వందే భారత్‌కు అదనంగా మరో 4 ఏసీ చైర్‌కార్లను యాడ్ చేశారు. రంగు, బోగీల్లో మార్పులు ఉంటాయని, స్టాపేజీలు, టైమ్ టేబుల్‌లో ఎటువంటి మార్పులేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు లో వెయింటింగ్ లిస్టు నిత్యం పెరుగుతున్న కారణంగా ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ 660 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిముషాల్లోనే చేరుకుంటుంది. ఈ రూట్ లో నాలుగు స్టేషన్లు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ కేటాయించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
