ఓ మనిషికైనా లేదా ఏదైనా వస్తువుకైనా వందేళ్ళ చరిత్ర అంటే అది ఆషామాషీ విషయం కాదు. వందేళ్ళ చరిత్ర ఉన్న సంగతులు చాలా అరుదుగా వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం వందేళ్ళ చరిత్ర గురించి ఎందుకు చర్చించుకుంటున్నామనే సందేహం మీకు కలగవచ్చు. అయితే అలాంటి శతాబ్ద చరిత్ర గలిగిన అరుదైన టేకు చెక్కతో చేయబడిన ఓ రథం గురించి తెలుసుకుందాం. అది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఎలా ఉందనే బోలెడన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం.
భక్తులు అనేక రకాలుగా ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఆధ్యాత్మిక సేవలో రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ఆలయాలలో మాత్రమే ఈ రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆలయాల ఉత్సవాల సమయంలోను, ప్రత్యేక పర్వదినాలలో మాత్రమే భగవంతుని ఉత్సవ మూర్తులను రథంలో ఉంచి ఊరేగిస్తారు. అలాంటి రథోత్సవ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని తమ చేతులతో లాగి భగవంతుని అనుగ్రహం పొంది తన్మయత్వంలో మునిగిపోతారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో పురాణ చరిత్ర కలిగిన శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి దేవస్థానం ఉంది. ఆలయానికి 100 సంవత్సరాల క్రితం బోగవెల్లి వెంకన్న అనే భక్తుడు టేకు చెక్కతో ఓ రధాన్ని తయారుచేసి స్వామివారికి కానుకగా సమర్పించారు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున స్వామివారు రథంలో ఆసీనులై గ్రామ పురవీధుల నడుమ భక్తుల కోలాహలం మధ్య ఊరేగుతారు. పదేళ్ల క్రితం రథం మరమ్మతులు చేయడానికి సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు టేకు చెక్కతో అలాంటి రథాన్ని తయారు చేయాలంటే 40 లక్షల రూపాయలపై మాటే. మహాశివరాత్రి రోజున రాజరాజ నరేంద్రుని ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ రథం ముందుకు సాగుతుంది. రధాన్ని బహుకరించిన భోగవల్లి వెంకన్న కుటుంబ సభ్యులు కార్యక్రమానికి హాజరై రథంపై చేయి వేశాకే రధాని ముందుకు తీస్తారు. బోగవల్లి వెంకన్న 35 సంవత్సరాలు కార్యక్రమంలో పాల్గొనగా తర్వాత 35 సంవత్సరాలు ఆయన కుమారుడు నరసింహమూర్తి రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం గత 30 ఏళ్లుగా నరసింహమూర్తి కుమారుడు చంటిబాబు ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. రథోత్సవం ముగిసిన అనంతరం ఆలయ అధికారులు దానిని ప్రత్యేక ప్రదేశంలో భద్రపరచడంతో వందేళ్లు గడిచిన రథం చెక్కుచెదరలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..