తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. తెలంగాణ, ఏపీలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి, మొక్కజొన్న, మామిడి తదతర పంటలకు నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఓ వైపు తీవ్ర ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరునంలో వాతావరణ శాఖ మరోసారి అలెర్ట్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగనుందని పేర్కింది.
నేడు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఉదయం వేళ అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం సాయంత్రం నుంచి రాయలసీమలో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని.. పొలంలో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..