తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈదురుగాలులు కూడా..

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అక్కడక్కడ వర్షాలు కూడా పడుతుండడంతో విచిత్ర వాతావరణం నెలకొంది. వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఓవైపు. పగలంతా మాడు పగిలే ఎండ. సాయంత్రం ఉన్నట్లుండి పడే వర్షం. ఇదేం వాతావరణం బాబోయ్‌ అంటున్నారు జనాలు.

తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈదురుగాలులు కూడా..
Rains 5

Updated on: Apr 12, 2024 | 6:34 PM

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అక్కడక్కడ వర్షాలు కూడా పడుతుండడంతో విచిత్ర వాతావరణం నెలకొంది. వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఓవైపు. పగలంతా మాడు పగిలే ఎండ. సాయంత్రం ఉన్నట్లుండి పడే వర్షం. ఇదేం వాతావరణం బాబోయ్‌ అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు భయం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్‌ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సీఎం సభా ప్రాంగణమైన ఏటూకూరు బైపాస్ దగ్గర ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

ఏపీలో రేపు ,ఎల్లుండి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రేపు 57 మండలాల్లో, ఎల్లుండి 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 111 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి కూర్మనాథ్‌ తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల రోజులు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్‌ ఉందంటున్నారు అధికారులు.

ఇక ఏపీలో నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో జల్లులతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. రాయలసీమ లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి, సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుందంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడ్డ ఉపరితల ద్రోణితో పాటు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమంటున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాతావరణం చల్లబడడంతో తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన ఉందంటున్నారు.