AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి.. సోమవారం ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో..

పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది ...

Weather: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి.. సోమవారం ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో..
Andhra Weather
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2026 | 7:10 PM

Share

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు, నైరుతి బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమవారం (జూన్ 15) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులను నది పరిసరాల్లో వదిలేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.

ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో – 38 మి.మీ, గుర్లలో – 35.7 మి.మీ, శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో – 33 మి.మీ, శ్రీకాకుళం జిల్లా లావేరులో – 32 మి.మీ, మన్యం జిల్లా సీతంపేటలో – 32 మి.మీ, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో – 30.5 మి.మీ వర్షపాతం రికార్డయింది.

వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, పశుకాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us