AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా వస్తుందా? చట్టం ఏం చెప్తుంది..!

పెళ్లై అత్తారింటికి వెళ్లిన కూతురుకు పుట్టింటి ఆస్తిలో హక్కులు ఉంటాయా లేదా అనే విషయంలో ఎన్నో అనుమానాలు, గందరగోళాలు ఉన్నాయి. ఒకవేళ తండ్రి తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనే దానిపై ఎలాంటి వీలునామా రాయకుండానే హఠాత్తుగా మరణిస్తే.. వివాహమైన బిడ్డకు ఆ ఆస్తిలో వాటా దక్కుతుందా? కొడుకులతో సమానంగా హక్కులు ఉంటాయా? అనే విషయాలు తెలుసుకుందాం..

తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా వస్తుందా? చట్టం ఏం చెప్తుంది..!
Married Daughter Rights On Father Property
Krishna S
|

Updated on: Jun 14, 2026 | 7:12 PM

Share

సమాజంలో ఆస్తి వివాదాలు, పంపకాల గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తండ్రి సంపాదించిన ఆస్తిపై కుమారులకు ఉండే హక్కుల గురించి అందరికీ అవగాహన ఉంటుంది కానీ, కూతుళ్ల హక్కుల విషయానికి వచ్చేసరికి అనేక అనుమానాలు, గందరగోళాలు తలెత్తుతుంటాయి. ఒకవేళ తండ్రి తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనే దానిపై ఎలాంటి వీలునామా రాయకుండానే హఠాత్తుగా మరణిస్తే.. వివాహమైన కూతురుకు ఆ ఆస్తిలో వాటా దక్కుతుందా? దక్కితే చట్టపరంగా ఆమె ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు.

2005 సుప్రీంకోర్టు సంచలన తీర్పు – సమాన హక్కులు..

మన దేశంలో హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం గతంలో ఆస్తి పంపకాల్లో కొడుకులకే ప్రాధాన్యత ఉండేది. కానీ.. కేంద్ర ప్రభుత్వం దీనిని సవరిస్తూ 2005లో సరికొత్త సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. తండ్రి ఆస్తిలో కుమారుడికి ఎంత హక్కు ఉంటుందో, కుమార్తెకు కూడా అంతే సమానమైన హక్కు ఉంటుంది. కూతురుకు పెళ్లయిందా లేదా అనే దానితో సంబంధం లేదు. వివాహం జరిగినప్పటికీ తండ్రి ఆస్తిలో ఆమె తన వాటాను చట్టబద్ధంగా డిమాండ్ చేయవచ్చు. 2020లో సుప్రీంకోర్టు సైతం ఒక కీలక తీర్పులో.. చట్టం సవరించిన 2005 నాటికి తండ్రి బతికి ఉన్నా లేకపోయినా, కుమార్తెలకు పుట్టుకతోనే తండ్రి ఆస్తిపై హక్కు వస్తుందని స్పష్టం చేసింది.

వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే పరిస్థితి ఏంటి?

ఒకవేళ ఒక వ్యక్తి తన స్వయంగా సంపాదించిన ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తిని ఎవరికి పంచాలో వీలునామా రాయకుండా మరణిస్తే.. దానిని చట్టం ప్రకారం ఇంటెస్టేట్ అంటారు. ఇలాంటి సమయంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆ ఆస్తి మొదట క్లాస్-1 వారసులకు చెందుతుంది.

క్లాస్-1 వారసులు అంటే ఎవరు?

మరణించిన వ్యక్తి భార్య , కొడుకులు, కూతుళ్లు..

సమాన పంపకం: తండ్రి వీలునామా రాయకపోతే, ఆస్తిని క్లాస్-1 వారసులందరికీ సమాన భాగాలుగా పంచాలి. ఉదాహరణకు ఒక తండ్రికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉంటే.. ఆస్తిని మూడు సమాన భాగాలుగా చేసి ముగ్గురికీ ఇవ్వాలి. కొడుకుతో సమానంగా వివాహమైన కుమార్తెకు కూడా ఒక పూర్తి వాటా దక్కుతుంది.

పెళ్లయిన కుమార్తె తన వాటాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

ఒకవేళ అన్నదమ్ములు లేదా కుటుంబ సభ్యులు ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తే, వివాహమైన కుమార్తె చట్టపరంగా ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వవచ్చు.

లీగల్ హెయిర్ సర్టిఫికేట్: మొదట తండ్రి మరణ ధృవీకరణ పత్రం తీసుకుని, తహశీల్దార్ ఆఫీస్ ద్వారా కుటుంబ సభ్యులందరి పేర్లతో కూడిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందాలి. ఇందులో కుమార్తె పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది.

విభజన దావా: ఆస్తిని సయోధ్యగా పంచడానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే, కూతురు సివిల్ కోర్టును ఆశ్రయించి విభజన దావా వేయవచ్చు. కోర్టు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఆధారంగా పరిశీలించి కూతురుకు రావలసిన చట్టబద్ధమైన వాటాను ఇప్పించాలని ఆదేశిస్తుంది.

చట్టంలోని ఒక ముఖ్యమైన మినహాయింపు

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తండ్రికి తన స్వయంగా సంపాదించిన ఆస్తిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఒకవేళ తండ్రి బతికుండగానే తన స్వయంగా సంపాదించిన ఆస్తిని కేవలం కొడుకుకో లేదా వేరే ఎవరికైనా రాసేస్తూ పక్కాగా వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేస్తే.. అప్పుడు కుమార్తె ఆ ఆస్తిని ప్రశ్నించే హక్కు ఉండదు. తండ్రి వీలునామా రాయకుండా చనిపోతేనే కుమార్తెకు సమాన వాటా వస్తుంది. కానీ పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి అయితే మాత్రం తండ్రి వీలునామా రాసినా రాయకపోయినా కుమార్తెకు పుట్టుకతోనే అందులో వాటా ఉంటుంది.

Follow Us