AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్..

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. ఎనిమిది రోజులుగా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, స్థానికులు విస్తృతంగా గాలిస్తున్నారు. కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో దానికి పోస్టుమార్టం నిర్వహించగా, నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Jun 14, 2026 | 2:13 PM

Share

కాకినాడ జిల్లాలో మిస్ అయిన జాహ్నవి ఎక్కడ?.. అమ్మనాన్న నుంచి దూరమై 8 రోజులు అవుతుంది.. ఎలా మిస్ అయ్యిందనే విషయం ఎవరికీ అంతు పట్టడం లేదు. మిస్సింగ్‌కు గల కారణాలూ కనిపించడం లేదు.. ఇలా చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు పెద్ద మిస్టరీగా మారింది. ఆమె ఆచూకీ కోసం తీవ్రమైన అన్వేషణ కొనసాగుతోంది. 8 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో.. పోలీసు బృందాలు, స్థానికులు అడవిని జల్లెడ పడుతున్నారు.. జాగిలాలు సైతం సెర్చింగ్ చేస్తున్నాయి. అయినా జాడ దొరకడం లేదు. ఈ క్రమంలోనే పెంపుడు కుక్క చనిపోవడం కలకలం రేపింది. జాహ్నవి మిస్సింగ్ కేసులో మృతి చెందిన పెంపుడు కుక్కకు ఆదివారం పోస్ట్‌మార్టం పూర్తయింది. తుని మండలం ఎన్.సురవరం ప్రభుత్వ పశు వైద్యశాలలో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ మోహన్ వంశీ ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం చేశారు. కుక్క మరణానికి గల కారణాలపై నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. నివేదిక అనంతరం వివరాలను వెల్లడించనున్నారు.

అయితే.. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. లేటెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై దృష్టి పెట్టారు. కాకినాడ ఎస్పీకి కాల్ చేసిన పవన్ కళ్యాణ్.. కేసు వివరాలు తెలుసుకున్నారు. అసలేమైంది? ఇన్ని రోజులైనా పాప ఎందుకు కనిపించలేదు? అని ఆరా తీశారు. ఇప్పటివరకు పాపను కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై జిల్లా ఎస్పీ పవన్‌కు వివరించారు. అయితే మరిన్ని బలగాల్ని రంగంలోకి దించి పాపను కనుగొనే ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అవసరమైతే NDRFని ఉపయోగించుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జాహ్నవిని వెతికేందుకు పోలీసులు మరింతమందిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.

తుని మండలం, దొండవాక సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న ఆ పాప తమ పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి జాహ్నవి.. తిరిగి వెనక్కి రాలేదు. ఎంత వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకు..జీపీఎస్ ట్రాకర్‌ అమర్చి తోటల్లోకి వదిలారు పోలీసులు. రెండు గంటల పాటు తోట పరిసర ప్రాంతాల్లో తిరిగిన కుక్క.. చివరికి మళ్లీ ఇంటికే చేరుకోవడంతో ఆశించిన ఆధారాలు లభించలేదు. ఈ కేసులో కీలకంగా భావించిన వారి పెంపుడు కూడా చనిపోవడంతో.. కేసుపై పోలీసులు మరింతగా దృష్టి సారించారు. ఇప్పటికే 200 మందికిపైగా పోలీసు సిబ్బంది జాహ్నవి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో మరింతమంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us