AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodi Rammurthy Naidu: తెలుగు జాతి కీర్తి పతాకం.. కలియుగ భీముడు.. కానీ జీవిత చరమాంకంలో…

ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు ఒక అసాధారణ తెలుగు బిడ్డ. ఛాతిపై ఏనుగులను నిలబెట్టడం, బస్సులు, రైళ్లను లాగడం వంటి బల ప్రదర్శనలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. బ్రిటన్ రాజకుటుంబం చే ఇండియన్ హెర్క్యులస్ బిరుదు పొంది, అపార కీర్తి, ధనం సంపాదించినా, జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Kodi Rammurthy Naidu: తెలుగు జాతి కీర్తి పతాకం.. కలియుగ భీముడు.. కానీ జీవిత చరమాంకంలో...
Kodi Rammurthy Naidu
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2026 | 4:07 PM

Share

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం నుంచి ప్రపంచ వేదికపై బల ప్రదర్శనలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అసాధారణ బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు. 1883 నవంబర్ 3న వీరఘట్టంలోని తెలగ వీధికి చెందిన కోడి వెంకన్న నాయుడు, అప్పలకొండ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే వ్యాయామంపై అమితాసక్తి కనబరిచారు. చదువు కంటే కసరత్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, రెండో తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. పది, పన్నెండేళ్ల వయసులోనే 500 మీటర్ల రాజచెరువులో అలసిపోకుండా ఐదారుసార్లు అటునుంచి ఇటు స్విమ్మింగ్ చేసేవారట. రామ్మూర్తి బలమైన దేహం, అకుంఠిత దీక్షను గుర్తించిన తండ్రి వెంకన్న, ఆయనను మద్రాసు వ్యాయామ కళాశాలలో చేర్చారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని, పూసపాటి అలకానంద గజపతి రాజు ప్రారంభించిన మహారాజా కళాశాలలో వ్యాయామ శిక్షకుడిగా పనిచేశారు. ఇక్కడే పొట్టి పంతులుతో స్నేహం ఏర్పడింది. రామ్మూర్తి అపారమైన దేహబలం, ధైర్యాన్ని చూసిన పొట్టి పంతులు, ఆయనకు సర్కస్ కంపెనీని ప్రారంభించమని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు సర్కస్ కంపెనీని స్థాపించిన రామ్మూర్తి, ప్రపంచ దేశాల్లో తన బల ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన ప్రదర్శనల్లో ఛాతిపై బండ రాయిని పెట్టి సుత్తితో కొట్టించుకోవడం, ఏనుగును ఛాతిపై ఎక్కించుకొని ఐదు నిమిషాల పాటు ఉంచడం, ఉక్కు గొలుసులను తుంచడం, రెండు కార్లను భుజాలకు కట్టుకొని లాగడం, కదులుతున్న రైళ్లను, బస్సులను ఆపేయడం వంటివి ఉండేవి.

కోడి రామ్మూర్తి నాయుడు వాయుస్థంభన చేసి ఛాతీని 12 అంగుళాలు పెంచేవారని కూడా ప్రచారంలో ఉంది. బలమే జీవితం, బలహీనతే మరణం అనే సిద్ధాంతాన్ని ఆయన శిష్యులకు బోధించారు. భారతదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు జపాన్, చైనా, బర్మా, లండన్ వంటి దేశాల్లోనూ రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చారు. లండన్‌లో ఆయన ప్రదర్శనలకు బ్రిటిష్ రాజు జార్జ్, రాణి మేరీ కూడా అభిమానులై, తమ రాజభవనానికి ఆహ్వానించి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఇండియన్ శాండో, కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీర కంఠీరవ, జగదేక వీర వంటి అనేక బిరుదులు ఆయన సొంతం. అపారమైన కీర్తి ప్రతిష్టలు, కోట్లాది రూపాయల సంపద సంపాదించిన రామ్మూర్తికి శత్రువులు కూడా పెరిగారు. లండన్, శ్రీలంక, మాస్కో, బర్మా దేశాల్లో ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. దీంతో విదేశీ ప్రదర్శనలను మానుకొని స్వదేశానికి తిరిగి వచ్చి యువకులకు వ్యాయామం, మల్లయుద్ధంలో శిక్షణ ఇచ్చారు. ఆయన సంపాదించిన ధనాన్ని దానధర్మాలకు వెచ్చించారని, ఎంత చేతికి వస్తే అంతా దానం చేసేవారని పరిశోధకులు చెబుతారు. బ్రహ్మచారి అయిన రామ్మూర్తి, తన అన్నదమ్ముల పిల్లలనే సొంత పిల్లలుగా చూసుకున్నారు. ఎంతో కీర్తి, ధనం సంపాదించినప్పటికీ, ఆయన చివరి రోజుల్లో ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు దిగజారాయి. సొంత ఊరిలో ఉండలేక, తన స్నేహితుడైన ఒడిశాలోని బాలాంగీర్ రాజుల ఆశ్రయం పొందారు. 1942 సంక్రాంతి పర్వదినాల్లో, జనవరి 16న ఒడిశాలోని బాలాంగీర్‌లో కోడి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత సరైన గుర్తింపు లభించలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళంలో ఆయన పేరుతో ఉన్న స్టేడియం అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి, దగ్గుబాటి రానా బయోపిక్‌లో నటిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. వందేళ్ల క్రితమే అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీగా వెలుగొందిన కోడి రామ్మూర్తి నాయుడు జీవితం, భావి తరాలకు స్ఫూర్తిదాయకం.

Follow Us