AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : అర్జెంటీనాను చిత్తు చేసి ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో విజయం సాధించిన స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మెస్సీ కల చెదిరిపోగా, ఎంబాప్పే గోల్డెన్ బూట్ దక్కించుకున్నాడు. ఫెర్రాన్ తోర్రెస్ గోల్‌తో స్పెయిన్ చరిత్ర సృష్టించింది.

FIFA World Cup 2026 : అర్జెంటీనాను చిత్తు చేసి ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jul 20, 2026 | 6:32 AM

Share

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైట్‌లో స్పెయిన్ 1-0 గోల్ తేడాతో సంచలన విజయం సాధించింది. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు స్పెయిన్ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అర్జెంటీనాను గట్టి ఒత్తిడిలోకి నెట్టారు.

నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. అయితే 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ ఫెర్రాన్ తోర్రెస్ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అర్జెంటీనా డిఫెన్స్ ను చీల్చుకుంటూ వెళ్లి ఆయన వేసిన పవర్ ఫుల్ షాట్ నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఒక్క గోల్ స్పెయిన్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించగా, మ్యాచ్‌ను సమం చేసేందుకు అర్జెంటీనా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టుకు మొదటి నుంచి అదృష్టం కలిసిరాలేదు. మ్యాచ్ మధ్యలో అర్జెంటీనా కీలక ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్‌కు రెఫరీ రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి బయటకు పంపించివేశాడు. దీంతో అర్జెంటీనా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. మైదానంలో స్పెయిన్ ఆటగాళ్లు ఏకంగా 20 సార్లు గోల్ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా, అర్జెంటీనా మాత్రం కేవలం 2 సార్లు మాత్రమే అలాంటి ప్రయత్నం చేయగలిగింది. అర్జెంటీనా గోల్‌కీపర్ మార్టినెజ్ అద్భుతమైన సేవ్‌లతో మొదటి 90 నిమిషాలు జట్టును కాపాడినప్పటికీ, ఎక్స్‌ట్రా టైమ్‌లో స్పెయిన్ ధాటికి లొంగక తప్పలేదు.

దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీకి ఈ ఫైనల్ మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ టోర్నమెంట్‌లో అంతకుముందు వరకు 8 గోల్స్ చేసి అద్భుత ఫామ్‌లో ఉన్న మెస్సీ, ఫైనల్లో మాత్రం స్పెయిన్ డిఫెండర్ల వ్యూహాల వల్ల స్పష్టమైన ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఆయన ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవడంలోనే కాకుండా గోల్డెన్ బూట్ అవార్డును కూడా కోల్పోయాడు. మొత్తం టోర్నీలో 10 గోల్స్ సాధించిన ఫ్రాన్స్ సంచలనం కిలియన్ ఎంబాప్పే అత్యధిక గోల్స్ చేసిన వీరుడిగా నిలిచి గోల్డెన్ బూట్ అవార్డును ముద్దాడాడు.

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిచి ఉంటే ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒకే ఒక్క అరుదైన రికార్డును సాధించి ఉండేది. ఇప్పటివరకు ఫుట్‌బాల్ చరిత్రలో కేవలం ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) జట్లు మాత్రమే వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్నాయి. 2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించిన అర్జెంటీనా, 2026 లో స్పెయిన్ చేతిలో భంగపాటుకు గురవ్వడంతో ఇటలీ, బ్రెజిల్ సరసన నిలిచే ఆ సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us