గుంటూరు జిల్లా, అక్టోబర్14; వారం రోజుల నుండి ఇజ్రాయెల్ లో జరుగుతున్న పరిణామాలతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. త్వరగా యుద్దం ముగిసిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడాలని ఇక్కడి స్థానికులు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. వీరంతా తాము యూదులమని ఎన్నో ఏళ్ళ క్రితమే తమ పూర్వీకులు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారని వీరంతా భావిస్తారు. దాదాపు నలభై యూదు కుటుంబాలు కొత్తరెడ్డిపాలెంలో నివసిస్తున్నాయి. వీరంతా హిబ్రూ భాష మాట్లాడుతారు. అంతేకాదు వీరికి ప్రత్యేక ప్రార్థనాలయం కూడా ఉంది. ఇక్కడ యూదు సాంప్రదాయంలోనే ప్రార్థనలు చేస్తారు. ఇక్కడే పుట్టి ఇక్కడే నివసిస్తున్నప్పటికీ తామంతా యూదులమేనని వీరు భావిస్తారు.
వీరందరినీ యూదులు గానే గుర్తించాలన్న వాదన కూడా వినిపిస్తారు. అలా గుర్తించాలని ప్రభుత్వానికి అర్జీ కూడా పెట్టుకున్నారు అయితే వీరంతా యూదులా కాదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానికంగా వీరందరినీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారుగా గుర్తిస్తున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయిల్ లో జరుగుతున్న యుద్దంతో తామంతా ఆందోళన చెందుతున్నామని యూదు సంరక్షకుడు జాకబ్ తెలిపారు. హామస్ దాడితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఇప్పటికైనా యుద్దం ముగిసిపోవాలంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు.
మొత్తం మీద ఇజ్రాయెల్ యుద్దంతో కొత్త రెడ్డిపాలెం సరైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడున్న యూదుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.
ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. హోరాహోరీ యుద్ధ దాడులతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంతటీ భయానక పరిస్థితుల్లో భారతీయులను ఇండియాకు తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి చార్టర్ విమానం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. ‘ఆపరేషన్ అజయ్’ కింద ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి పసిపాపతో సహా 212 మంది భారతీయ ప్రయాణికులతో బయలుదేరిన విమానం సురక్షితంగా దేశరాజధానిని చేరుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..