మీరు వాట్సప్‌లో చాటింగ్ చేస్తుంటారా.. మీ నెంబర్‌కు ఎప్పుడైనా ఓటిటి ఫ్లాట్‌ఫాంలో ఉచిత స్ట్రీమింగ్ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా.. పొరపాటున వాటిని క్లిక్ చేశారా.. మీ బ్యాంకు ఖాతాల్లో నగదు ఇట్టే మాయమైపోతాయి.. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ హాట్‌స్టార్ మొదలైన ఓటిటి ప్లాట్‌ఫాంకు సంబంధించిన నకిలీ లింక్స్ వాట్సప్‌లలో సర్క్యులేట్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ హెచ్చరించారు. మొదట వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు సంబంధించిన నకిలీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ లింకులు వాట్సప్ ద్వారా పంపుతారని, అది ఫ్రీ అని ఆశపడి ఆ లింక్ పై క్లిక్ చేయగానే.. ఆ ఓటిటి ప్లాట్‌ఫాం కు సంబంధించిన యాప్‌ను మీ సెల్‌లో ఇన్‌స్టాల్ చేయమని చూపుతుంది. వెంటనే మీరు ఆ యాప్ ను ఇన్‌స్టాల్ చేయగానే వాటిని యాక్టివేట్ చేయడం కోసం మీకు ఓటిపి కోసం మరొక లింకు వస్తుంది. మీరు ఆ ఓటిపిని ఎంటర్ చేయగానే ఫోన్ సైబర్ నేరగాళ్ళ అధీనంలోకి వెళుతుంది. ఆ తరువాత మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ళు తెలుసుకుంటారు. అలా సేకరించిన వివరాలతో మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును కాజేస్తారు. అందుకే ఇలాంటి మోసాలకు గురికాకుండా ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రకాశం జిల్లా ఎస్‌పి సూచించారు.
1. మీకు ఎవరైనా ఇలాంటి లింకులను పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు.
2. మీకు తెలియని, పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ లకు స్పందించొద్దు.
3. మీకు తెలియని ఎటువంటి లింకులను ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దు.
1. ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
2. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయాలి.
3. లేదంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..