లీగలా.. ఇల్లీగలా..? ఇసుక తవ్వకాలపై ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక దుమారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు ఆరోపణలు చేసారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండా తవ్వకాలు చేస్తున్నారని, కాంట్రాక్ట్ సంస్థకు గడువు ముగిసినా కొనసాగిస్తున్నారంటూ ఆరోపించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి పది ప్రశ్నలు కూడా సంధించారు చంద్రబాబు.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. మూడు రోజులపాటు ఇసుక తవ్వకాలపై నిరసనలు నిర్వహించింది. మొదటి రెండు రోజులు సత్యాగ్రహ దీక్షల పేరుతో ఇసుక రీచ్‌ల వద్ద నిరసనలు చేపట్టారు టీడీపీ నేతలు. మూడో రోజు విజయవాడలో గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడికి తీవ్ర ప్రయత్నం చేసారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన నిరసనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. దీంతో అసలు ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది.
తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు, నిరసనలపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాల విషయంలో ఏం జరిగింది? ఎంత ఆదాయం సమకూరింది.. ప్రజలకు ఎలాంటి సౌకర్యంగా ఉంది అనే అంశాలతో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా మాజీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అడిగిన పది ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు పెద్దిరెడ్డి. టీడీపీ హయాంలో 19 సార్లు ఇసుక విధానం మారుస్తూ జీవోలు ఇచ్చినట్లు పెద్దిరెడ్డి చెప్పారు. 2021 ఏప్రిల్ 16 న ఇచ్చిన జీవో 25 ప్రకారం ఇసుక తవ్వకాలు, అమ్మకాలు సాగుతున్నాయని స్పష్టత ఇచ్చారు. వైసీపీ వచ్చిన తర్వాత పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. టెండర్లలో ఎక్కవ కోట్ చేసిన జేపీ సంస్థకు టెండర్లు అప్పగించినట్లు చెప్పారు. చంద్రబాబుకు కూడా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి.. ఆయన కూడా టెండర్లలో పాల్గొంటే ఆయనకు అవకాశం ఇచ్చేవారమని చెప్పుకొచ్చారు. ఏటా ఇసుకపై 765కోట్లు ఆదాయం వస్తుందన్నారు.ఈ లెక్కన ఐదేళ్లలో 3825 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందన్నారు. మరి చంద్రబాబు హయాంలో ఇంత డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. ఇక అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై 18 వేల కేసులు నమోదు చేశామని.. 6లక్షల 36 వేల మెట్రిక్ టన్నుకల ఇసుక సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 136 స్టాక్ పాయింట్లలో.. 64 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. మొత్తం 110 ఓపెన్ రీచ్ ల ద్వారా 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చామని.. ప్రస్తుతం తవ్వకాలు జరగడం లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక విధానంలో అనేక అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా ఆదాయం చాలా తక్కువగా వచ్చిందని మంత్రి తెలిపారు. 2018-19లో మైనింగ్ ద్వారా 1950 కోట్లు ఆదాయం వస్తే వైసీపీ హయాంలో 4756 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. ఏపీఎండీసీకి 2018-19లో 833 కోట్లు మాత్రమే ఆదాయం వస్తే.. వైసీపీ హయాంలో 1806 కోట్లు ఆదాయం వచ్చిందని లెక్కలతో సహా వివరించారు మంత్రి పెద్దిరెడ్డి. కాంట్రాక్ట్ సంస్థకు టెండర్ ఇచ్చి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా మైనింగ్ జరిగేలా చూస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..