విశాఖలోని బీచ్ రోడ్డు వద్ద అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్‌లో తల్లి,కొడుకులు నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా అలికిడి లేదు. ఇద్దరూ బయట కూడా రాలేదు. కట్ చేస్తే ఆ ఫ్లాట్ నుంచి ఏదో దుర్వాసన. తలుపు తట్టినా తీయలేదు.. పోలీసులు రంగంలోకి దిగారు. తలుపు పగులగొట్టి చూస్తే మృతదేహం లభించింది. విశాఖ పెదవాల్తేరు కురుపాం టవర్స్‌లో శ్యామల దేవి, కొడుకు శరవన్ కుమార్ నివాసం ఉంటున్నారు. కొడుకు బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. అయితే గత కొన్నాళ్ళ నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళుఉంటున్న ఫ్లాట్ నెంబర్ 408 నుంచి కొన్ని రోజులుగా ఎవరూ బయటికి రావడంలేదు. దీనికి తోడు వారు ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. తలుపు తట్టారు. ఎంతకూ తీయకపోవడంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు. దీంతో లోపల శ్యామల మృతి చెందినట్టు గుర్తించారు. కూర్చున్న స్థితిలో శ్యామలాదేవి ప్రాణాలు కోల్పోయినట్లు గమనించారు. పోలీసులు లోపలికి వెళ్లినప్పటికి కొడుకు కూడా అదే ఇంట్లో మరో గదిలో ఉన్నాడు. కానీ అతనికి ఈ విషయం తెలియదు. అతన్ని ప్రశ్నించేసరికి అమ్మ పడుకుని ఉందని బదులిచ్చినట్లు 3 టౌన్ సిఐ రామారావు తెలిపారు. అమాయకంగా సమాధానం చెప్పుతుండడంతో.. అతని మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
శ్యామల దేవి మృతి చెంది దాదాపు నాలుగైదు రోజులు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. గుండెపోటుతో శ్యామల మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బెంగళూరులో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. తల్లి ప్రాణాలు కోల్పోతే.. అదే ఇంట్లో కొడుకు నాలుగైదు రోజులుగా ఉండడం చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..