Watch Video: సర్టిఫికేట్ల కోసం వచ్చిన విద్యార్థి.. స్పృహ కోల్పోవడంతో వెలుగులోకి షాకింగ్ నిజాలు..

| Edited By: Srikar T

Jul 14, 2024 | 8:35 AM

ఒంగోలులో డ్రగ్స్‌ కల్చర్‌ రాజ్యమేలుతుందా.. ముఖ్యంగా విద్యార్దులే ఈ డ్రగ్స్‌ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారా.. ఒంగోలులో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ నీట్‌ అకాడమీ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకున్న హర్షవర్డన్‌ అనే విద్యార్ది తన సర్టిఫికెట్ల కోసం వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో అతడిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.

Watch Video: సర్టిఫికేట్ల కోసం వచ్చిన విద్యార్థి.. స్పృహ కోల్పోవడంతో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Ongole
Follow us on

ఒంగోలులో డ్రగ్స్‌ కల్చర్‌ రాజ్యమేలుతుందా.. ముఖ్యంగా విద్యార్దులే ఈ డ్రగ్స్‌ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారా.. ఒంగోలులో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ నీట్‌ అకాడమీ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకున్న హర్షవర్డన్‌ అనే విద్యార్ది తన సర్టిఫికెట్ల కోసం వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో అతడిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. నాలుగురోజులుగా చికిత్స తీసుకుంటున్న హర్షవర్డన్‌‎కు డ్రగ్స్ ఇచ్చినట్టు డాక్టర్లు తేల్చారు. నాలుగురోజులుగా ఆసుపత్రిలో ఉన్న హర్షవర్డన్‌ ఇప్పటికీ తీవ్రమైన నరాల బలహీనతతో సరిగ్గా నిలబడలేక, మాట్లాడలేకపోతున్నాడు. సర్టిఫికెట్ల కోసం కోచింగ్‌ సెంటర్‌కు వచ్చిన తనకు తనతోపాటు వచ్చిన నలుగురు స్నేహితులు లస్సీలో ఏదో కలిపి ఇచ్చారని, అది తాగిన తరువాత ఏమైందో తనకు తెలియడం లేదని హర్షవర్డన్‌ చెబుతున్నాడు.

డ్రగ్స్‌ ఇచ్చి కొట్టారు.. బంధువులు

మరోవైపు హర్షవర్గన్‌ పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డకు స్నేహితులే డ్రగ్స్‌ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టారని భావిస్తున్నారు. ఆసుపత్రిలో హర్షవర్దన్‌ను నడవలేని స్థితిలోనే ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. నడవలేని స్థితిలో హర్షవర్డన్‌ను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకువచ్చారని అడిగితే.. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు విచారించాలని చెప్పడంతో పేరెంట్స్ తీసుకొచ్చామంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పిన ఆ ఎస్‌ఐ నిందితులకు మద్దతు ఇచ్చేలా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేషన్ కు వచ్చిన బాధితుడితో కంప్లైంట్ తీసుకోకుండా.. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తే విద్యార్దులు కావడంతో వాళ్ల కెరీర్‌ నాశనమవుతుందని తమకు హిత బోధ చేస్తున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ విద్యార్ది కాదా.. అతనికి అన్యాయం జరిగితే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. తమ బిడ్డను కొట్టిన వారిని వదిలేసి విచారణ పేరుతో తమను స్టేషన్‌కు రావాలని పోలీసులు ఎలా అంటారని నిలదీస్తున్నారు విద్యార్ధి హర్షవర్ధన్‌ తండ్రి హరికృష్ణ, అత్త నళిని.

కలకలం రేపిన ఘటన..

ఒంగోలులో నాలుగురోజుల క్రితం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. నగరంలో విద్యార్దులు విచ్చలవిడిగా డ్రగ్స్‌ వాడుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్నేహితుల మధ్య ఉన్న గొడవల కారణంగా ఓ విద్యార్దికి డ్రగ్స్‌ ఇచ్చి కొట్టినట్టు భావిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే హర్షవర్గన్‌ కేసులో పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు బాధితుని కుటుంబ సభ్యులు. నిందితుల బ్యాక్‌ గ్రౌండ్ బలంగా ఉందన్న సాకుతో తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని బాధితుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చిత్తశుద్దిని శంకించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ ఘటనలో డ్రగ్స్‌ వాడినట్టు తేలితే వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. లేకుంటే ఒంగోలులో డ్రగ్స్ మాఫియా పెరిగిపోవడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణంగా మారే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..