బంగారు, వెండి ఆభరణాలు భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ వృక్షాలకు కూడా భద్రత లేకుండా పోయింది. రాత్రికి రాత్రే విలువైన చెట్లు మాయమవుతున్నాయి. దీంతో పోలీసులు పొలం గట్లపై కూడా నిఘా పెట్టాల్సిన పరిస్థితి కల్పించారు దుండగులు. చెట్లు ఏంటి దొంగతనం ఏంటనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లకు చెందిన చవ్వాకుల వెంకట కోటేశ్వరావు తన పొలంలో టేకు చెట్లు పెంచుతున్నాడు. అయితే చెట్లు ఏపుగా పెరిగి మంచి ధర పలికే సమయం వచ్చింది. దీంతో వాటిని అనుమతి తీసుకొని కటింగ్ చేయిద్దామని అనుకుంటున్నాడు. జూన్ 27న ఎప్పటిలాగే తన పొలానికి వెళ్లాడు. అయితే ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. పదిహేను చెట్లు ఉండాల్సి చోట ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. దీంతో పొలమంతా కలియదిరిగాడు. చెట్లను కట్ చేసి తీసుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి.
వెంటనే వాటి యజమాని వెంకట కోటేశ్వరావు ముప్పాళ్ళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ముప్పాళ్లకే చెందిన ఖాసిం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు నర్సరావుపేటలోని ఒక ప్రాంతంలో ఉన్న ఆటోను గుర్తించారు. అందులో ఉన్న టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముప్పాళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రికి రాత్రే పదిహేను టేకు చెట్లను కొట్టేసి వాటిని ఆటోలో నర్సరావుపేటకు తరలించినట్లు ఖాసిం చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే చెట్లను కొట్టడానికి సహకరించిన అందరిని అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..