Andhra Pradesh: ఏపీలో మారుతున్న రాజకీయ లెక్కలు.. తమ్ముడికి అన్నయ్య తోడైతే.. కమలనాథుల వ్యూహం ఇదేనా?

కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారంటారు.. ఏపీలో బీజేపీయులు మాత్రం... మా కార్యాన్ని ఆ గాడ్‌ఫాదరే తీరుస్తారు అనే ధీమాతో ఉన్నారు. మేరే పాస్ గాడ్‌ఫాదర్ హై అంటూ కొత్తగా స్లోగన్లు కూడా రాసుకుంటున్నారు. అడిగినా అడక్కపోయినా... సదా మీ సేవలో అంటూ ఇన్‌డైరెక్ట్‌గానే మద్దతిస్తున్న సదరు గాడ్‌ఫాదర్‌లో ఆపద్బాంధుడే కనిపిస్తున్నారు బీజేపీ నాయకులకి.

Andhra Pradesh: ఏపీలో మారుతున్న రాజకీయ లెక్కలు.. తమ్ముడికి అన్నయ్య తోడైతే..  కమలనాథుల వ్యూహం ఇదేనా?
Pawan Kalyan -Chiranjeevi
Ram Naramaneni

|

Nov 21, 2022 | 7:06 PM

గాడ్‌ఫాదర్‌ అలియాస్ మెగాస్టార్… అలియాస్ చిరంజీవి. రాజకీయాలకు దూరందూరం అంటూనే.. రాజకీయాల్ని జస్ట్ అలా టచ్‌ చేసి వదిలేస్తూ… ఫ్యాన్స్‌లోనే కాదు… ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌ని కూడా ఎటెన్షన్‌లో ఉంచుతున్నారు. లేటెస్ట్‌గా ఆయనిచ్చిన మరో ఫీలర్ అయితే.. పొలిటికల్లీ టూ స్ట్రాంగ్‌. నాకైతే కుదరలేదు.. నా తమ్ముడు మాత్రం తేల్చేస్తాడు… అనుకున్నది సాధిస్తాడు.. అంటూ మెగా అన్నయ్య ఇచ్చిన ఈ కాంప్లిమెంట్… ఆ తమ్ముడిని ఫిదా చేసిందో లేదో తెలీదు. ఆయన పక్కనే ఉన్న కమలనాథుల్ని మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పవర్‌స్టార్ స్టామినానే బలంగా ఉపయోగించుకుని ఏపీలో పూర్వ వైభవం సాధించాలనుకుంటున్న బీజేపీకి.. చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ బూస్ట్ నిస్తోంది.

సరిగ్గా నెలన్నర కిందట కూడా చిరంజీవి నుంచి ఇటువంటి వాయిస్సే ఘనంగా వినిపించింది. పవన్‌ లాంటి వాడు రావాలి… రాజకీయాల్ని మార్చాలి… అన్నీ అనుకున్నట్టు జరిగితే పవనే ఏలాలి… అంటూ తన మనోగతాన్ని ఎక్స్‌పోజ్ చేశారు చిరంజీవి. సో… అవకాశం వచ్చిన ప్రతిసారీ… పవన్‌లో తను కలలు గన్న పొలిటికల్ ఫ్యూచర్‌ని చూసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాష్ట్ర రాజకీయాల్లో పవన్‌కల్యాణ్‌ తురుపుముక్క కాబోతున్నారని, అత్యున్నత పదవులకి పవన్‌ ఎంతో దూరంలో లేరు అని చిరు నర్మగర్భంగా చెప్పిన మాటల్ని బీజేపీ తమకు అనువుగా తీసుకుంటోంది. ఎందుకంటే… చిరంజీవి సపోర్ట్‌నిస్తానంటున్న జనసేన… ఇప్పుడు బీజేపీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. మొన్నీమధ్యే బీజేపీతో పవన్‌కి గ్యాప్ వచ్చిందనట్టు కనిపించినా… మోదీ వైజాగ్ టూర్‌తో అది కూడా పటాపంచలైంది. సో… జనసేన ఎదగడం అంటే బీజేపీ ఎదగడమన్నట్టే లెక్క. అటు… ఏపీలో జవసత్వాల్ని కూడదీసుకుని… పార్టీని పూర్తిగా యాక్టివేట్ చేయాలన్న కమిట్‌మెంట్‌తో ఉన్న కమలనాథులు.. దానికి తగ్గ అన్ని దారుల్నీ వెతుకుతోంది.

పార్టీలోకి రావాలంటూ నేరుగా చిరంజీవికే ఇన్విటేషన్ పంపింది బీజేపీ. కానీ.. దాన్ని మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలొచ్చాయి. ఇటీవల అల్లూరి సీతారామరాజు శతజయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీతో వేదిక పంచుకున్నారు చిరంజీవి. బీజేపీ వెటరన్ లీడర్ బండారు దత్తాత్రేయ అలయ్‌బలయ్‌లో కూడా స్పెషల్ గెస్టు చిరంజీవే. ఇటువంటి ప్రతీ సందర్భంలోనూ బీజేపీ-చిరంజీవి మధ్య డీల్ కుదురుతోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సో… చిరంజీవి బీజేపీతో ఉన్నారా… లేరా అనేది అటుంచితే… తాను బీజేపీతో ఉన్నా లేకపోయినా… ఆ పార్టీకి పరోక్షంగానైనా మద్దతునిస్తున్నట్టు చిరు నుంచి సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా జనసేనతోనే ఉంటున్న మెగా బ్రదర్ నాగబాబు… పవన్‌కల్యాణ్‌కి బాసటనిస్తున్నారు. పెద్దన్నయ్య చిరంజీవి కూడా… దూరంగా ఉంటూనే పవన్‌కల్యాణ్‌ భావజాలాన్ని మెచ్చుకుంటూ పరోక్షంగా మద్దతునిస్తున్నారు.

రాజకీయాల్ని వదిలేసి వెళ్లిపోయిన చిరంజీవిని మళ్లీ వెల్‌కమ్ చేసి… ఆయన తోడ్పాడుతో ఏపీలో పాగా వెయ్యాలన్నది బీజేపీ అల్టిమేట్ గోల్. ఆ లక్ష్యాన్ని జనసేన ద్వారా చేరుకోవాలనుకుంటున్న ఏపీ బీజేపీని… ఇప్పుడు చిరంజీవి నైతిక మద్దతు కూడా తోడవ్వడంతో ఫుల్ హ్యాపీగా ఉంది. ఎన్నికల సీజన్ వరకూ గాడ్‌ఫాదర్ ఇలా అడపాదడపా స్టేజ్ మీదెక్కి… ఇటువంటి స్టేట్‌మెంట్స్ ఇస్తే చాలు.. అదే పదివేలు అనుకుంటోంది ఏపీ కమల దండు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu