AP Special Status Issue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు సోమవారం నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో సోమవారం నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని విజయసాయిరెడ్డి నోటీసులో కోరారు.
ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారని గుర్తుచేశారు. అందులో ఏపీకి ప్రత్యేక హోదా అతి ప్రధానమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించిందని గుర్తుచేశారు. కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్న కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులో విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభలో వైసీపీ ఎంపీల ఆందోళన..
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. వైసీపీ ఎంపీలు రాజ్యసభ వెల్ లోకి వెళ్ళి నిరసన తెలిపారు.
Also Read..
ప్రధాని నోట బాహుబలి మాట.. వ్యాక్సిన్ తీసుకుంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు: నరేంద్రమోదీ
శ్రీవారికి మరో స్వర్ణాభరణం.. రూ.1.08 కోట్లు విలువైన స్వర్ణ ఖడ్గాన్ని బహుకరించిన హైదరాబాద్‌వాసి