Watch Video: కలికాలం అంటే ఇదే నేమో.. శీతాకాలంలోనూ దర్శనమిస్తున్న వేసలి ఫలాలు..! ఇదెక్కడి వింతో!
సాధారణంగా వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఎండా కాలం, వర్షా కాలం, శీతాకాలం అని గుర్తుపెట్టుకుంటాం. అదే కాకుండా ఆ సీజన్‌లో లభించే పండ్లను బట్టి కూగా అది ఏ కాలమో మనం చెప్పొచ్చు. కానీ వేసవి కాలంలో లభించే తాటి ముంజులు,మామిడి పళ్ళు శీతాకాలంలో లభిస్తే.. నిజంగా అది ఆశ్చర్యమే కదా. ఇలాంటి వింత పరిస్థితే ఓ జిల్లాలో వెలుగు చూసింది అదెక్కడో తెలుసుకుందాం పదండి.

ఎండలు ఎక్కువగా ఉండే కాలం వేసవి కాలం. గజగజ వణికే చలి ఉండే కాలం శీతాకాలం. వానలు ఎక్కువగా కురిసే కాలం వర్షాకాలం. ఇలా వాతావరణ పరిస్థితులను బట్టి అది ఏ కాలమో ఇట్టే చెప్పగలం. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో లభించే వివిధ రకాల ఫ్రూట్స్ ను బట్టి కూడా అది ఏ కాలమో చెప్పొచ్చు. ఉదాహరణకు మామిడి,తాటి మింజులు, పుచ్చకాయలు లభిస్తున్నాయి అంటే అది వేసవి కాలం అని..మార్కెట్లో సీతాఫలాలు, నేరేడు పళ్ళు వంటివి దొరికుతున్నాయి అంటే అది వర్షాకాలం అని. అదే ఉసిరి, రేగు పళ్ళు,నారింజ వంటివి లభిస్తే అది శీతాకాలం అని టక్కున చెప్పేస్తాం. అదే వేసవి కాలంలో లభించే తాటి ముంజులు, మామిడి పళ్ళు శీతాకాలంలో లభిస్తే.. నిజంగా అది ఆశ్చర్యమే కదా. ఇలాంటి వింత పరిస్థితే శ్రీకాకుళం జిల్లాలో కంటపడింది.
శ్రీకాకుళంలో నిత్యం రద్దీగా ఉండే డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామ లక్ష్మణ జంక్షన్ కి వెళ్ళే రోడ్డులో PSN స్కూల్ వద్ద చెట్టు కింద తాటి ముంజులు అమ్ముతున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకి చెందిన ఓ కల్లుగీత కార్మిక కుటుంబం ఇక్కడ గత 15 రోజులుగా ప్రతి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తాటి ముంజలు అమ్ముతున్నారు. అలా అని ఈ తాటి ముంజలు ఏ హై బ్రీడ్ రకమో లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసినవో అనుకునేరు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల మండలాల పరిధిలోని పలు తాటి చెట్ల నుంచి సేకరించినవే అమ్ముతున్నారు. అక్కడ నుంచి నగరానికి ఆటో లో గెలలతో తాటి కాయలు తెచ్చి, కస్టమర్ల ముందే తాటికాయలు వలచి తాజా ముంజులు అమ్ముతున్నారు.
అసలు ఈ సీజన్లో తాటి ముంజలు ఏంటి అని అడిగితె.. కొన్ని చెట్లు ముందే కాపుకి వచ్చేశాయని.. అలా వచ్చిన చెట్ల నుండి తాటికాయలు తీసి అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నామని అమ్మేవారు చెబుతున్నారు. తాటి మంజుల ధర డజను రూ.50 లు నుంచి రూ.60 పలుకుతున్నాయి. ఇక తాటి ముంజులు అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు. అసలే దొరక్క దొరక్క శీతాకాలంలో లభిస్తుండటంతో ధర ఎక్కువ ఉన్న ఏమాత్రం ఆలోచించకుండా ఆ మార్గంలో వెళ్ళే వారంతా ఎగబడి మరి ముంజలు కొంటున్నారు.
కాలాన్ని బట్టి, ఋతువును బట్టి ప్రకృతి మనకు సహజ సిద్ధమైన పళ్ళను అందిస్తుంది. ఆయా కాలాల్లో ఉండే వాతావరణ పరిస్థితులను తట్టుకొని మన ఆరోగ్యానికి రక్షణగా ప్రకృతి మనకు ఆయా ఋతువులకు తగ్గట్టు పళ్ళను అందిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఏ సీజన్లో లభించే పళ్ళను ఆయా సీజన్లో ఎక్కువుగా తినాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు కూడా.అయితే ఇపుడు మరోవైపు కాలం కానీ కాలంలో తాటి ముంజులు లభిస్తుండటంతో చూసేవారు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే కలికాలం ప్రభావం.. కాలాలు, ఋతువులు మారిపోతున్నాయని, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు అన్ని వింతలు జరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




