
దొంగలు ఇప్పుడు రెండు రకాలు.. చదువు అబ్బక, చెడు తిరుగులు, చెడు సాహసాలతో చిన్నప్పటి నుంచి పిక్ పాకిటింగ్, ఇళ్ళు, ఆలయాలు, దుకాణాలలో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారు ఒకరైతే.. పెద్దపెద్ద చదువులు చదువుకొని హ్యాకింగ్‌లు, డిజిటల్ అరెస్టులు, యాప్ లు ద్వారా జనాలను మోసం చేసి వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారు ఇంకొందరు. అయితే ఇప్పుడు చదువు అబ్బక ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడేవారు సైతం తెలివి మీరిపోయారు. వారు కూడా వైట్ కాలర్ నేరగాళ్ల లాగా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు. టెక్నాలజీని ఎంచక్కా వాడుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దొంగల ముఠానే శ్రీకాకుళం జిల్లా పోలీసులకు చిక్కారు.
ఏ ఆలయంలో చోరీకి పాల్పడాలి.. ఏ ఆలయంలో దొంగతనం చేస్తే అధిక మొత్తంలో తమకు గిట్టుబాటు అవుతుంది. దొంగతనం అనంతరం ఏ మార్గంలో ఎస్కేప్ అవ్వాలి ఇలాంటివి అన్ని వీరు ఆన్ లైన్ లోనే డిసైడ్ అవుతారు. ఆ తర్వాత రంగంలోకి దిగి రెక్కీ నిర్వహించి పక్కా స్కెచ్ తో గుట్టుగా పని కానిచ్చేస్తారు. అలాంటి ఈ ముఠా కన్ను చిన్న తిరుపతిగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై పడింది. కొన్ని నెలల కిందట ప్రారంభమైన ఈ ఆలయంలో కిందటేడాది నవంబర్ 1, కార్తీక ఏకాదశి రోజున జరిగిన తొక్కిసలాటలో 9మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటన దేశ ప్రజలందరినీ ఒక్కసారిగా ఉలికి పాటుకు గురి చేసిన విషయం తెలిసిందే..
ఒరిస్సా రాజకుటుంబానికి చెందిన హరిముకుంద పండా అనే 76ఏళ్ల వృద్ధ భక్తుడు తిరుపతిని పోలి పలాసలో 12ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయం ప్రారంభానికి ముందు నుంచే ఇటు మెయిన్ స్ట్రీమ్, అటు సోషల్ మీడియాలలో ఫుల్ ఫోకస్ అయింది. దీంతో ఈ ముఠా పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై ఫోకస్ పెట్టింది.
ఈ నెల మూడో తారీఖున ఆలయానికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. అంతరం పక్క స్కెచ్ తో ఈనెల 9వ తేదీన ఆలయం ప్రాంగణంలోని ఓ మెస్ ను తొలగించి లోపలకి చొరబడి తరవాత గర్భగుడి తాళాలు బ్రేక్ చేసి లోపలకు ప్రవేశించారు. ఆలయంలోని బంగారు, వెండి భారణాలు, హుండీలోని రూ.80 వేల నగదు మొత్తం రూ.40.25 లక్షల విలువ చేసే సొత్తు దొంగలించారు. ఆలయంలో చోరీకి గురైన వాటిలో స్వామివారి బంగారు నామాలు, వెండి కవచం, పాదాలు, చేతులతో పాటు మరెన్నో విలువైన ఆభరణాలు ఉన్నాయి. అయితే దొంగతనం జరిగిన వారం రోజులలోనే కాశీబుగ్గ పోలీసులు ఈ చోరీ కేసును ఛేదించారు.
చోరీకి సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, 15KG ల వెండి ఆభరణాలు, హుండీలోని రూ.80వేల నగదు పూర్తిగా రికవరీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని L.N. పేట మండలంకి చెందిన k. శ్రీనివాసరావు(A1), S.బోగేష్(A2),S. సుదర్శన్ రావు(A3),దార రమేష్(A5),హిరమoడలంకి చెందిన పీ.చక్రధర్(A4) లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భోగేష్, సుదర్శనారావులు చోరీకి పాల్పడగా చోరీ చేసిన ఆభరణాలను చక్రధర్ ద్వారా రమేష్ కి అమ్మకానికి అప్పజెప్పారు నిందితులు. నిందితులు అంతా అంతకు ముందు జైలులో ఒకరికొకరు పరిచయం అయ్యారు. పెద్దగా చదువు లేనప్పటికీ జైలులో ఏర్పడ్డ పరిచయాలు వల్ల మొబైల్ టెక్నాలజీ పైన కొంత పట్టు సంపాదించారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుపై గతంలో 38 చోరీ కేసులు, భోగేష్ పై 10, సుదర్శనారావుపై 7 చోరీ కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన నిందితులు తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కిందటేడాది నవంబర్ లోనే వీరు జైలు నుంచి బయటకు వచ్చారు. ఈనేపథ్యంలోనే ఈనెల 3న పలాస లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి రెక్కీ నిర్వహించి, ఈనెల 9 రాత్రి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు నిందితులు. గతంలో చేసిన చోరీలకు సంబంధించి నిందితులపై సస్పెక్ట్ షీట్ కూడా కొనసాగుతోంది. ఈ సస్పెక్ట్ షీట్ కారణంగానే నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆలయంలో చోరీ జరిగిన వారం రోజులకే నిందితులను పట్టుకున్నారు.
అయితే ఇదంతా ఆ చిన్న తిరుపతిగా భావించే వేంకటేశ్వరుని మహిమ అని భావిస్తున్నారు భక్తులు. అందుకే చోరీ జరిగిన వారం రోజులకే వారి పాపం పండి పోలీసులకు పట్టుబడ్డారని అనుకుంటున్నారు. దేవుడి సొత్తును కాజేయటం అంటే మాటలు కాదని అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..