AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వావ్ ఎంత అద్భుతంగా ఉందో.. ఒకే రోజు మూడు సీజన్‌ల వాతావరణం.. ఎక్కడో తెలుసా

సాధారణంగా ఏడాదిలో మూడు కాలాలు చూస్తాం. వేసవికాలం.. వర్షాకాలం.. శీతాకాలం. వేసవిలో ఎండలు, వర్షాకాలంలో వానలు, శీతాకాలంలో చలి సహజం. ఒక్కో కాలం నాలుగేసి నెలల చొప్పున ఉంటుంది. కానీ.. ఇక్కడో ప్రాంతంలో మాత్రం ప్రస్తుతం ఈ మూడు సీజన్లు ఒకే రోజులో కనిపిస్తున్నాయనట. అంతేకాదు, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఈ వాతావరణ మార్పులను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడో తెలుసుకుందాం రండి.

Watch: వావ్ ఎంత అద్భుతంగా ఉందో.. ఒకే రోజు మూడు సీజన్‌ల వాతావరణం.. ఎక్కడో తెలుసా
Three Seasons In One Day Unique Weather In Alluri District
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 31, 2026 | 10:46 AM

Share

అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో విచిత్రమైన వాతావరణం పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఒకే రోజులో మూడు రకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేకువజామున పొగమంచు కమ్ముకుని చల్లని వాతావరణం ఉండగా.. మధ్యాహ్నం సమయానికి ఎండలు సుర్రుమంటున్నాయి. ఇక సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు కురవడం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తోంది. సముద్రంలో వాతావరణ మార్పుల కారణంగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏర్పడటం.. ఎత్తైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మన్యంలో పాడేరు, అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకే రోజులో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం వేడి, ఉక్కపోత, సాయంత్రానికి వర్షం కురవడానికి ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ మార్పులకు కారణాలు ఇవే..

ఉదయం దట్టమైన పొగమంచు: ఏజెన్సీ ప్రాంతాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి. ఇక్కడి దట్టమైన అడవులు, కొండల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, రాత్రివేళ నేల త్వరగా చల్లబడినప్పుడు గాలిలోని తేమ నీటి బిందువులుగా మారి దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. ఇది ఉదయం 9 గంటల వరకు కమ్ముకుని ఉంటుంది.

మధ్యాహ్నం సుర్రుమనే ఎండ: ఉదయం పొగమంచు తొలగిపోయిన తర్వాత సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుతుంది. మధ్యాహ్న సమయానికి ఎండ తీవ్రత పెరిగి భూమి వేడెక్కుతుంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుఫానుల ప్రభావంతో సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు ఏజెన్సీ అడవుల్లోకి ప్రవేశిస్తాయి. ఈ వేడి, తేమ కలిసి మధ్యాహ్నం వేళ తీవ్రమైన ఉక్కపోతతో కూడిన వాతావరణాన్ని కలిగిస్తాయి.

సాయంత్రానికి వర్షం: మధ్యాహ్నం బాగా వేడెక్కిన గాలి పైకి లేస్తుంది. ఈ వేడి గాలి తేమను మోసుకుంటూ కొండల వాలుల వెంబడి వేగంగా ఆకాశంలోకి పైకి వెళ్తుంది. ఎత్తైన ప్రాంతాలకు చేరుకునేసరికి ఈ గాలి చల్లబడి, దట్టమైన మేఘాలుగా మారుతుంది. దీనివల్ల సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. వీటినే కన్వెక్టివ్ రెయిన్ అంటారు.

బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో సాధారణ రోజుల కంటే ఈ వాతావరణ మార్పులు మరింత తీవ్రంగా కనిపిస్తాయి. ఈ విధంగా ఒకే రోజులో మూడు రుతువుల అనుభూతి కలగడం ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇలాంటి విభిన్న వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నప్పటికీ.. ఆరోగ్యపరంగా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us