ఆక్సిజన్ స్పెషల్ రైలు అనంతపురం జిల్లాకు చేరుకుంది. యాస్ తుఫాన్ తీవ్రమవుతోన్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్దమైంది. యాస్ తుఫాన్ ప్రభావం ఏపీ తో పాటు ఐదు రాష్ట్రాల పై ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వంను కేంద్రం అలెర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ముందస్తు చర్యలు తీసుకుంది ఏపీ సర్కార్. రూర్కెల, ఒడిషా నుండి 100 మిలియన్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఇప్పటి తెప్పించింది. తాజాగా మరో 100 టన్నుల ఆక్సిజన్ లారీలు ఇక్కడి వచ్చాయి.
ఆక్సిజన్ స్పెషల్ రైలు తాడిపత్రి రైల్వేస్టేషన్ చేరినట్లు డీఆర్‌ఎం అలోక్‌తీవారి వెల్లడించారు. కరోనా విలయతాండవం నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్ నుంచి వెస్ట్ బెంగాల్, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆక్సిజన్ అత్యవసరమైందన్నారు. దీంతో 32 స్పెషల్ ఆక్సిజన్ రైళ్లను ఆయా రాష్ట్రాలకు తరలించారన్నారు.
టాటానగర్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ స్పెషల్ రైలు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు చేరింది. మొత్తం 10 గూడ్స్ వ్యాగన్లలో(బూస్ట్ వ్యాగన్)లో 100 టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాడిపత్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ కంటైనర్ల ద్వారా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు ఆక్సిజన్ తరలించామన్నారు.