Andhra Pradesh: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు..కల్లంలో మిర్చిపంట దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు…
ఆ గ్రామంలో మిర్చి పంటను అధికంగా సాగు చేస్తారు. గత రెండేళ్ళుగా మిర్చికి మంచి ధర ఉండటంతో రైతులు ఈ ఏడాది అధికంగా మిర్చి సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి.. ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ధర కొంతమేర తగ్గినా క్వింటాకు 15000 నుండి 20000 రూపాయలు వస్తున్నాయి.
గుంటూరు, జనవరి24; పల్నాడు గ్రామాల్లో పగలు సెగలు రాజ్యమేలుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ప్రత్యర్థులు దగ్దం చేస్తున్నారు. గతంలో వినుకొండ ప్రాంతంలో ఏపుగా పెరిగిన మిర్చి మొక్కలను పీకేసి రైతుకు ఆర్థికంగా నష్ట కల్గించారు. ఈ తరహా ఘటనలు సాధారణంగా అనంతపురం జిల్లాలో జరుగుతుంటాయి. అయితే పల్నాడు ప్రాంతంలోనూ రాజకీయ, వ్యక్తిగత కక్షలతో పంటలను ధ్వంసం చేసే సంస్కృతి ప్రబలి పోతుంది. కళ్ళంలో ఉంచిన మిర్చిని తగులబెట్టిన ఘటన మరోసారి పల్నాడులో కలకలం రేపింది
అది గురజాల మండలం పల్లెగుంత గ్రామం. గ్రామంలో మిర్చి పంటను అధికంగా సాగు చేస్తారు. గత రెండేళ్ళుగా మిర్చికి మంచి ధర ఉండటంతో రైతులు ఈ ఏడాది అధికంగా మిర్చి సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి.. ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ధర కొంతమేర తగ్గినా క్వింటాకు 15000 నుండి 20000 రూపాయలు వస్తున్నాయి.
గ్రామానికి చెందిన రమణయ్య ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మొదటి కోతలో దాదాపు పదిహేను క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. మిర్చిని కళ్ళంలో ఆరపోశారు. మిర్చి ఎండిన తర్వాత విక్రయిస్తుంటారు. రాత్రి పొద్దు పోయే వరకూ కళ్ళంలోనే ఉన్న రమణయ్య మిర్చిని కుప్ప చేసి ఇంటికి వెళ్ళాడు. తెల్లవారే సరికి కళ్ళంలోకి వచ్చి చూడగా మిర్చి మొత్తం తగులపడి పోయింది. దీంతో రైతు ఒక్కోసారిగా కుప్ప కూలిపోయాడు. కళ్ళంలో అనేకమంది రైతుల మిర్చి ఉంటే కేవలం రమణయ్య మిర్చిని మాత్రమే తగులపెట్టారు దీంతో వ్యక్తి గత కక్షలతో నే మిర్చిని తగులపెట్టినట్లు రమణయ్య భావిస్తున్నాడు. 240000 రూపాయల విలువ చేసే మిర్చి మొత్తం కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశానని అయితే చేతికొచ్చిన పంటను తగల పెట్టారన్నారు.
మిర్చిని తగలపెట్టిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు మొదట్లోనే తుంచి వేయకపోతే ఎన్నికల సమయంలో మరింతగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకొనే అవకాశం ఉందని రైతు సంఘ నేతలు అంటున్నారు. పోలీసులు వెంటనే నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..