నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వానలు పడ్డాయి. ఇవాళ కూడా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని(Telangana) పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు(Andhra Pradesh) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఈ రోజు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి సైతం తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షసూచన ఉంది. వర్షాల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాలు కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.
శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో వర్షం కురిసింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వానలు కురుస్తున్న పలు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాలాల వద్ద ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యం లో ట్విట్టర్, ఫోన్ కాల్స్, ప్రజా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
మరోవైపు.. తెలంగాణలో ఈ నెల 28 వరకు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..