Atmakur By Election Counting Highlights: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ.. భారీ మెజార్టీ సాధించిన విక్రమ్ రెడ్డి..
Atmakur By Election Counting: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
Atmakur By Poll Results Highlights: ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. 82,888 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై విజయ బావుటా ఎగురవేశారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది మొదలు.. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతీ రౌండ్‌లోనూ వైసీపీ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కు విక్రమ్ రెడ్డి మెజార్టీ భారీగా పెరుగుతూ వచ్చింది. మొత్తం 1,02,240 ఓట్లు పోలవగా.. 82,888 ఓట్ల మెజార్టీ సాధించారు విక్రమ్ రెడ్డి. ఆత్మకూరు ఉపఎన్నికల్లో ఫ్యాన్ జోరుకు కమలం పార్టీ కొట్టుకుపోయింది. కనీసం ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది.
కాగా, నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాలు కౌంటింగ్ కోసం పాలెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మొత్తం 14 టేబుళ్లు, 20 రౌండ్ల తో ఓట్లు లెక్కించారు. పటిష్టమైన పోలీసు భద్రతా వలయంలో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. కాగా, ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,13,338 కాగా, పోలైన ఓట్లు 1,37,081, పోస్టల్ ఓట్లు 493, కౌంటింగ్ రౌండ్లు 20, కౌంటింగ్ టేబుళ్లు 14, కౌంటింగ్ సిబ్బంది 100 ఉన్నారు.
ఈ నెల 23న ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. గతంలో 83.32 శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి 64.14 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. వైసీపీ తరుపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, బీజేపీ తరుపున భరత్ కుమార్ ఈ ఉపఎన్నికలో ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
ఇకపోతే ఆత్మకూరు సహా దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంఘఢ్, పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ స్థానాలతో పాటు త్రిపురలోని అగర్తలా, జుబరాజ్‌నగర్, సుర్మా, బార్దౌలి, ఢిల్లీలోని రజీందర్ నగర్, జార్ఖండ్‌లోని మందార్, ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న ఉపఎన్నికలు జరిగాయి.
LIVE NEWS & UPDATES
-
ఆత్మకూరు ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన విక్రమ్ రెడ్డి..
ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. 82,888 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై విజయ బావుటా ఎగురవేశారు.
-
తొమ్మిదొ రౌండ్‌లోనూ వైసీపీదే హవా..
ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా ఏమాత్రం తగ్గడం లేదు. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూనే ఉంది. ప్రత్యర్థులు జాడనైనా లేకుండా పోయారు. తొమ్మిదో రౌండ్ వరకు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కి.. 45,924 ఓట్లు పోలవగా.. 37,609 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక బీజేపీకి 8,315, బీఎస్పీకి 2,217 ఓట్లు పోలయ్యాయి.
-
-
ఆత్మకూరు ఉప ఎన్నికల ఆరో రౌండ్ ఫలితాల వివరాలు..
ఆత్మకూరు ఉప ఎన్నికల ఆరో రౌండ్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు. ఈ రికార్డుల ప్రకారం.. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి ఆరో రౌండ్‌లో 5,324 ఓట్లు పోలయ్యాయి. బీజేపి అభ్యర్థి భరత్ కుమార్‌కు 713 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఓబులేసుకు 194 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చూసుకుంటే.. మేకపాటి విక్రమ్ రెడ్డి 25,854 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
-
ఐదో రౌండ్‌లోనూ వైసీపీదే మెజారిటీ..
ఆత్మకూరు ఉప ఎన్నికల ఐదో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రౌండ్‌లోనూ వైసీపీదే హవా కొనసాగుతోంది. ఐదో రౌండ్ ఫలితాలు ఇలా ఉన్నాయి..
వైయస్సార్ సీపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 5103 బీజేపి అభ్యర్థి భరత్ కుమార్ : 1247 బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు : 228 వైసీపీ అభ్యర్థి మెజారీటీ : 21243
-
నాలుగో రౌండ్ ఫలితాల వివరాలు..
ఆత్మకూరు ఉపఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 21,043 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 3,658, బీఎస్పీ అభ్యర్థి ఓటులేసు కు 683 ఓట్లు పోలయ్యాయి. ఇక నాలుగు రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 17,385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
-
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ ముందంజ..
ఆత్మకూరు ఉపఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ ముందంజలో ఉంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 9,180 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ ఉంది.
-
ప్రారంభమైన ఆత్మకూర్ బైపోల్ ఓట్ల లెక్కింపు.. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు..
ఆత్మకూర్ బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల కౌంటింగ్‌కు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
-
మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్నికల కౌంటింగ్..
ఆత్మకూర్ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
Published On - Jun 26,2022 7:30 AM