AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. శుక్రవారం స్కూళ్లకు సెలవు..

అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24 గంటలో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలపింది. తీరంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

AP Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. శుక్రవారం స్కూళ్లకు సెలవు..
Schools Holiday
Ram Naramaneni
|

Updated on: Sep 05, 2024 | 9:49 PM

Share

ఏపీలో గత వారం రోజుల్లో వరుణుడు ఎలాంటి విధ్వంసం చేశాడో చూశాంగా. ఆ పరిస్థితుల నుంచి ఇంకా కోలుకోనే లేదు. ఈ లోప బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలను అలర్ట్ చేసింది. అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ఇచ్చింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్‌,  పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ చెప్పారు. ఈ హెచ్చరికలతో.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అలెర్టయ్యారు. వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా శుక్రవారం.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విజయవాడలో ఇప్పటికీ దారుణ పరిస్థితులు

వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నా..ముంపు ప్రాంతాల వాసులకు మాత్రం పూర్తి స్థాయిలో కష్టాలు తీరడం లేదు. ప్రధాన రోడ్లు, వాటికి అనుబంధంగా ఉన్న రోడ్లపై సహాయక చర్యలు అందుతున్నా.. లోపల ఉన్న కాలనీలు, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వం వివిధ సంస్థలతో పెద్దమొత్తంలో ఆహారం తయారు చేయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సరిగా పంపిణీ జరగడం లేదు. దీంతో వందలకొద్దీ బస్తాల ఆహారం..చెత్తకుప్పల పాలవుతోంది.

మరోవైపు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో ముంపు ప్రాంతాలు కొన్ని ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. దొంగల భయం కారణంగా బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి నిరాకరిస్తూ అక్కడే భయం భయంగా ఉంటున్నారు. నీళ్లలోనే దూరప్రాంతాలకు వెళ్లి నిత్యావసరాలను తెచ్చుకొని అక్కడే ఉంటున్నారు. వరద ముప్పు ఇంకా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు. వరదనీరు ఎక్కువగా ఉండటంతో సహాయ సిబ్బందికి ప్రతిబంధకంగా మారింది. మరోవైపు బుడమేరుకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతుండడం ముంపు ప్రాంతాల వాసులను భయపెడుతోంది.

లంక గ్రామాల్లో పంట, పొలాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. గుంటూరు జిల్లాలో 31 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. లంక గ్రామాల్లో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు. వీటికి పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పంటలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత రైతులు. ఇక కృష్ణా జిల్లాలోని కొయ్యగూరపాడు, ఆముదాలపల్లి, వెల్దిపాడు, ఎలుకపాడు వంటి గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.వరదలతో పాటు కొట్టుకొస్తున్న పాములు బాధితులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.