Visakha Garjana: ఒక ప్రాంతం అభివృద్ధి కాదు.. 3 ప్రాంతాలకూ సమన్యాయం కావాలి.. విశాఖ గర్జనలో ప్రతిధ్వనించిన నినాదం..

| Edited By: Janardhan Veluru

Oct 15, 2022 | 2:19 PM

ఒక ప్రాంతం అభివృద్ధి కాదు.. 3 ప్రాంతాలకూ సమన్యాయం జరగాలని నినదించారు జనం. సింహాద్రి అప్పన్న సాక్షిగా వేలాది మంది కదం తొక్కిన ర్యాలీలో వికేంద్రీకరణ నినాదం మార్మోగింది.

Visakha Garjana: ఒక ప్రాంతం అభివృద్ధి కాదు.. 3 ప్రాంతాలకూ సమన్యాయం కావాలి.. విశాఖ గర్జనలో ప్రతిధ్వనించిన నినాదం..
Visakha Garjana
Follow us on

ఒక ప్రాంతం అభివృద్ధి కాదు.. 3 ప్రాంతాలకూ సమన్యాయం జరగాలని నినదించారు జనం. సింహాద్రి అప్పన్న సాక్షిగా వేలాది మంది కదం తొక్కిన ర్యాలీలో వికేంద్రీకరణ నినాదం మార్మోగింది. ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని రావాల్సిన చారిత్రక అవసరాన్ని నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ప్రతినిధులు వివరిస్తే.. అభివృద్ధి మోడల్‌ను వివరించారు మంత్రులు. పనిలో పనిగా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని పట్టుపడుతున్న విపక్షాలను ఏకిపారేశారు వైసీపీ నేతలు.

విశాఖ తీరంలో రాజధాని నినాదం మార్మోగింది. సాగర ఘోషతో పోటీపడి జన గర్జన ప్రతిధ్వనించింది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ.. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తూ.. జన ప్రవాహం ఉప్పెనై పోటెత్తింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. అంటూ వేలాది మంది నినదిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ప్రధాన ఎజెండాగా గర్జన చేపట్టింది జేఏసీ. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్టుల ఆధారంగా.. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రస్తావిస్తోంది జేఏసీ. అమరావతిని రాజధానిగా తాము అంగీకరించినప్పుడు.. విశాఖను రాజధానిగా ఎందుకు అంగీకరించరని ప్రశ్నిస్తున్నారు.

రాయలసీమకూ న్యాయం జరగాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. సీమ, కోస్తా నాయకులనూ జేఏసీ ఆహ్వానిస్తోంది. సమైక్యంలో సమన్యాయం ఉండాలనే నినాదంతో విశాఖ గర్జించింది. భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే.. మూడు రాజధానులే పరిష్కారమని జేఏసీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

వర్షం ఆపలేకపోయింది. దూరాభారాలూ లెక్కచేయలేదు. దశాబ్దాల వెనుకబాటుదనం దహించేస్తుంటే. మండే గుండెలు ఉద్యమజెండా పట్టాయ్‌. రాజధాని సంకల్పంతో ఉక్కు పిడికిలి బిగించాయ్‌. పాలనా రాజధానిగా విశాఖనే ఉండాలంటూ వేల గొంతులు నినదించాయ్‌. పాదం పాదం కలిపి ర్యాలీగా కదిలాయ్‌. విశాఖ తీరం జన సంద్రాన్ని తలపించింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి.. బీచ్‌రోడ్డులోని వైఎస్ విగ్రహం దగ్గరకు ర్యాలీ జరిగింది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాదితో తరలివచ్చిన జనంతో విశాఖ బీచ్ రోడ్డు కిక్కిరిసిపోయింది.

చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలి.. కానీ తాము అందరి అభివృద్ధిని కోరుకుంటున్నామంటున్నారు వైసీపీ నేతలు. తాము చేసేది ప్రజా పోరాటమనీ.. చంద్రబాబు చేసేది రియల్‌ ఎస్టేట్‌ పోరాటమని ఆరోపించారు మంత్రి రోజా. ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయమని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖకు రాజధానిని సాధించేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశాఖలో అరిస్తే అమరావతికి వినపడాలన్నారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజధాని కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై అమరావతి రైతులు దండయాత్ర చేస్తున్నారని జేఏసీతో పాటు ఉత్తరాంధ్ర నేతలు ఆరోపించారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబాటుకు గురైంది. ఇంకా నష్టపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..