అమరావతి, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాస్త్రాలు ఎక్కుపెడుతోంది. ఈ తరుణంలో టీడీపీ కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో రా.. కదలిరా అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పై విమర్శలు సంధిస్తున్నారు. ఇదంతా బాగున్నప్పటికీ టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాలపై క్లారిటీ రానే లేదు.. ఏ పార్టీకి ఏ సీటు వస్తుందనేదానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. కానీ సీటు మాదే.. గెలుపు మాదే.. అంటున్నారు తిరుపతి జనసేన కార్యకర్తలు. ఇంతకీ వాళ్లకున్న నమ్మకమేంటి? సీటు తమకే వస్తుందన్న గ్యారంటీ ఏంటి? తిరుపతి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. మిత్రపక్షమైన టీడీపీకి సైతం అందని రీతిలో జనసేన వ్యూహాలు రచిస్తోంది. ఈ టికెట్ కోసం టీడీపీలో అరడజను మంది నేతలు పోటీ పడుతుంటే.. జనసేన కార్యకర్తలు మాత్రం తమకే సీటు వస్తుందనే ధీమాలో ఉన్నారు.
గతంలో చిరంజీవి గెలిచిన చరిత్ర.. నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీటు తమకే కేటాయించాల్సిందేనని జనసేన పట్టుబడుతోంది. తాజాగా భేటీ అయిన జనసేన కార్యకర్తలు.. తిరుపతి నుంచే తమ పార్టీ అధినేత పవన్ పోటీ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన పోటీ చేస్తే రాష్ట్రంలో ఎవరికీ రానంత మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓటర్ లిస్ట్‌లో అవకతవకలపైనా జనసేన ప్రత్యేక దృష్టిపెట్టింది. తిరుపతిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని.. వాటిని తొలగించేలా ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో.. పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. తిరుపతి నుంచి జనసేన పోటీ చేస్తోందని కేడర్‌కు స్పష్టం చేసిన నేతలు.. బూత్ కమిటీలు, వార్డు కమిటీలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేలా కసరత్తు ప్రారంభించింది. మరోవైపు జనసేన దూకుడు, వరుస సమావేశాలతో టీడీపీ క్యాడర్ అయోమయంలో పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..