Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CASTE CENSUS: ఏపీలో మొదలైన సర్వే.. ఇంటింట సామాజిక-ఆర్థిక, కుల గణన

కులగణన ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టాలని నిర్ణయించింది. పది రోజుల్లో సర్వే పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజకీయ లాభం కోసమే కులగణన అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే, ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమం అందించడం కోసమే అంటుంది వైసీపీ ప్రభుత్వం.

AP CASTE CENSUS: ఏపీలో మొదలైన సర్వే.. ఇంటింట సామాజిక-ఆర్థిక, కుల గణన
Ap Caste Census
Follow us
pullarao.mandapaka

| Edited By: Balaraju Goud

Updated on: Jan 19, 2024 | 6:55 PM

కులగణన ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టాలని నిర్ణయించింది. పది రోజుల్లో సర్వే పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజకీయ లాభం కోసమే కులగణన అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే, ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమం అందించడం కోసమే అంటుంది వైసీపీ ప్రభుత్వం.

రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వేను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న కోటీ 60 లక్షల కుటుంబాల సర్వే చేయనుంది ప్రభుత్వం. దీనికోసం వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చారు అధికారులు. ఎక్కడా వ్యక్తిగత డేటా బయటికి వెళ్లకుండా అత్యంత జాగ్రత్తగా సర్వే చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇంటింటి సర్వేలో భాగంగా రెండు దశల్లో మొత్తం ప్రక్రియ జరగనుంది.

మొదటి దశలో గ్రామ, వార్డు వాలంటీర్లు వారికిచ్చిన సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా యాప్ లో సమాచారం నిక్షిప్తం చేస్తారు. ఒక ఇంటికి సర్వేకు వెళ్లినప్పుడు ఆ కుటుంబం ప్రాధమిక వివరాలైన జిల్లా పేరు, మండలం, వార్డు, ఇంటి నెంబర్ వంటి వివరాలు తీసుకుంటారు. ఆ తరువాత కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్, కుటింబసభ్యుల వివరాలు, రేషన్ కార్డు నెంబర్, ఇంటి రకం, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, గ్యాస్ సదుపాయం, పశుసంపద సమాచారం తీసుకుంటారు. ఇక ఆ తర్వాత సెక్షన్‌లో కులం, ఉప కులం, మతం, వృత్తి, పంట భూమి, నివాస భూమి వంటి వివరాలు సేకరిస్తారు.

మొత్తం 723 కులాలకు సంబందించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా విభజిస్తారు. బుడగ జంగాలు, పిరమలై కల్లర్(తేవర్), యలవ కులాలను ఇతర కులాల జాబితాలో నమోదు చేస్తారు. జనవరి 19 నుంచి ఈ నెల 28 వరకూ పది రోజులపాటు వాలంటీర్లతో ఇంటింటి సర్వే జరగనుంది. ఇలా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లిన సమయంలో ఎవరైనా అందుబాటులో లేనట్లయితే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకూ దగ్గరలోని సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా మొదట వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసే సమయంలో ఆ సమాచారం సంబంధిత సచివాలయ సిబ్బందికి చేరుతుంది. ఈ సమాచారాన్ని సచివాలయ సిబ్బంది మరోసారి ఇంటింటికీ వెళ్లి సమాచారం సరైందా కదా అనేది క్రాస్ చెక్ చేసుకుని ఆమోదిస్తారు. మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలోనే బీహార్ తరువాత కులగణన చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సర్వే ద్వారా ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు అందిస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. అయితే కొన్ని కులాల ఓట్లు తొలగింపు కోసమే కుల గణన అంటున్నాయి ప్రతిపక్షాలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…