డబ్బులెవరికీ ఊరికే రావు.. అతిగా ఆశపడ్డారో.. మోసపోతారు జాగ్రత్త

| Edited By: Ram Naramaneni

Oct 06, 2023 | 11:14 AM

టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా డెవలప్‌ అవుతోందో అంతే స్పీడ్‌గా మోసాలు అప్‌డేట్ అవుతున్నాయి. కొత్త తరహాలో దోచేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. సోషల్‌ మీడియా ఫేక్‌ ఐడీ క్రియేట్ చేసి... సైబర్ స్టాకింగ్, కస్టమర్ కేర్ పేరుతో కాల్ చేసి ఖాతాలు లూటీ చేస్తున్నారు. రోజుకో విధంగా.. పూటక ప్లానే వేసి మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సరికొత్త ఉపాయంతో సమాజంలోకి చొరబడుతున్నారు సైబర్ బూచోళ్లు.

డబ్బులెవరికీ ఊరికే రావు.. అతిగా ఆశపడ్డారో.. మోసపోతారు జాగ్రత్త
Nigerian Arrested
Follow us on

అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనం కష్టపడి సంపాదించిన డబ్బును మాయమాటలతో లాగేస్తున్నారు. సామాన్య ప్రజలను నిమిషాల వ్యవధిలో నమ్మించి.. సెకన్ల వ్యవధిలో వారి ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ క్రైమ్స్‌లో ఎన్నో రకాలు ఉండాయ్.  తాజాగా మీరు ఇచ్చే నగదుకు విదేశీ నగదు అధిక మొత్తంలో ఇస్తామని మాయ మాటలు చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల డబ్బును కాజేస్తున్నారు. ఇలాంటి హైటెక్ ముఠా మాయలో పడవద్దు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు పోలీసులు.

తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన ఒక వివాహితను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకొని నమ్మించి.. ఇండియా డబ్బులకు డాలర్లు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఆ మహిళ వారిని నమ్మి విడతల వారీగా 26 లక్షలు ముట్టజెప్పింది. అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి మోసపోయానని గుర్తించి..బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకోని సాంకేతిక పరిజ్ఞానంతో మోసానికి పాల్పడింది నైజీరియన్ అని.. అతడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ ఢిల్లీ వెళ్లింది. అతడి అడ్డాలో మకాం వేసిన ఏపీ పోలీసుల టీమ్..  సైబర్ క్రైమ్స్‌కు పాల్పడుతున్న నైజీరియన్‌ను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.

పోలీసుల విచారణలో కోస్తాకు చెందిన MBBS విద్యార్థిని నుండి కూడా 50 లక్షల రూపాయలు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇతను దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్లకు రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. బేతంచర్లలో మహిళ ఫిర్యాదు మేరకు డోన్ కోర్టుకు నిందితున్ని హాజరుపరచగా రిమాండు విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఏ బ్యాంక్‌ కూడా కస్టమర్ల ఖాతా వివరాలు.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్‌, సీవీవీ నెంబర్లను అడగదు.. బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని చెప్పినా సరే.. ఎవరికీ సీక్రెట్‌ నెంబర్లను చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో OTP ఎవరికీ షేర్‌ చేయకూడదు. అయితే.. అలాంటిది ఏది లేకుండానే.. ఈ నయా దందాలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌తో ఖాతా ఖల్లాస్‌ అవుతోంది. ఆ మెయిల్‌ క్లిక్‌ చేశారంటే.. ఇక అంతే. ఇలా ఎన్నో సైబర్ మోసాలు. అందుకే డియర్ పీపుల్.. బీ అలెర్ట్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..