AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఎంత పని చేశావ్ తల్లి.. పెళ్లి జ్ఞాపకాలు మరువకముందే నవ వధువు బలవన్మరణం

టెట్‌ పరీక్షలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే మనస్తాపంతో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో నవ వధువు తనూజ ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన 50 రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Andhra: ఎంత పని చేశావ్ తల్లి.. పెళ్లి జ్ఞాపకాలు మరువకముందే నవ వధువు బలవన్మరణం
Tanuja
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Aug 21, 2026 | 8:50 AM

Share

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టెట్‌ పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్తాపంతో ఓ నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లయిన కేవలం 50 రోజులకే ఈ ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం పట్టణంలోని అయ్యన్నపేటకు చెందిన విసినిగిరి చంద్రశేఖర్‌ వీరఘట్టం పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె తనూజకు సమీప బంధువు ప్రసన్నకుమార్‌తో ఈ ఏడాది జూలై 2న వివాహం జరిగింది. వివాహం అనంతరం కొంతకాలం విజయనగరంలో ఉన్న తనూజ ఆషాఢ మాసం అనంతరం ఈ నెల 19న అత్తవారి గ్రామమైన చినరాజేరుకు వెళ్లింది. టెట్‌ పరీక్షలో తాను ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేదని తనూజ తీవ్రంగా కలత చెందింది. టెట్‌ రెస్పాన్స్‌ షీట్‌లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో మేడ పై గదిలో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందింది.

తనూజకు ఇతర ఎలాంటి సమస్యలు లేవని, టెట్‌లో తక్కువ మార్కులు రావడం వల్లే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పెదమానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నవ వధువు తనూజ మృతితో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన కొద్ది రోజులకే కుమార్తెను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో చినరాజేరు గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us