AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP vs TDP: జోగి రమేష్ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ పోలీసు అధికారులు తొత్తులుగా మారారని తెలుగు తమ్ముళ్లు ఫైర్!

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం దగ్గర ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని టీడీపీ అంటుంటే.. టీడీపీ నేతలే ఎమ్మెల్యే కారుపై దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

YCP vs TDP: జోగి రమేష్ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ పోలీసు అధికారులు తొత్తులుగా మారారని తెలుగు తమ్ముళ్లు ఫైర్!
Tdp Vs Ycp
Balaraju Goud
|

Updated on: Sep 21, 2021 | 12:45 PM

Share

TDP fire on Police officials: టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం దగ్గర ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని టీడీపీ అంటుంటే.. టీడీపీ నేతలే ఎమ్మెల్యే కారుపై దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తంగా మారాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలతో పాటు ప్రత్యక్ష దాడులకు వరకు వెళ్లింది. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర పరాజయంతో కుదేలైన టీడీపీని మరింత అణగదొక్కాలన్న ప్రయత్నం చేయడంతో పరిస్ధితులు ఎప్పటికప్పుడు వాడీవేడిగా మారిపోతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఇరు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేశాయి. అయితే, ఆ రోజు జరిగిన ఘటనల్లో వైసీపీ తప్పేంలేదని గుంటూరు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో టీడీపీ కేంద్ర హోంశాఖను ఆశ్రయించింది.

వాస్తవానికి సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేతలు, చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు ఇప్పటికే వందలసార్లు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అప్పటికప్పుడు వాటికి ప్రత్యర్ధి పార్టీలు కౌంటర్లు ఇచ్చుకోవడం, ఆ తర్వాత అంతా మామూలైపోవడం పరిపాటే. అయితేచ తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని పట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లడం ఇప్పుడు వివాదాన్ని రాజేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్న విషయం మరిచి జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడం, ఆ తర్వాత పోలీసులు కూడా ఆయన తప్పిదాన్ని కప్పిపుచ్చి.. ఆయన్ను అడ్డుకున్న టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు వైసీపీ తప్పేం లేదంటూ గుంటూరు పోలీసులు చేసిన ప్రకటనలు మరింత వివాదానికి కారణమయ్యయి.

జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్దకు కర్రలు, జెండాలతో, మందీ మార్బలంతో రావడం వీడియో ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నా గుంటూరు పోలీసులు తమ నేతలదే తప్పంటూ తేల్చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఇంటి వద్ద అసలేం జరిగిందో డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియోలను కేంద్ర హోంశాఖకు పంపింది టీడీపీ. రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్ అండ్ కో చేసిన హంగామాపై పూర్తి ఆధారాలు సమర్పించారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఇరుకునపడింది. అలాగే, చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై పూర్తిస్దాయిలో దర్యాప్తు చేయించాలని హోంశాఖను టీడీపీ ఎంపీ కోరారు. మరోవైపు, ఇప్పటికే అక్కడ ఘటనతో టీడీపీ నేతలే దాడి చేశారని, జోగి రమేష్ రాకపై తమకు సమాచారం లేదని రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పిన నేపథ్యంలో హోంశాఖ తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలావుంటే, తాజాగా టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమైన అధినేత చంద్రబాబు ఈ వ్యవహారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్, కార్యకర్తలతో దాడిచేయడమే కాకుండా.. బాధితులైన టీడీపీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అబద్దాలకు, అరాచకానికి, వంచనకు చిరునామా జగన్ జమానాగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థది ప్రేక్షక పాత్ర వహించటం బాధాకరమన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల్ని అందుకు సహకరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఇప్పుడు తప్పు చేసిన వారు రేపు ఎక్కడ దాక్కున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అకారణంగా అధికారమదంతో తమరు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని తెలిపారు.

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ సినిమా కథను బాగా అల్లారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. నిన్న త్రివిక్రమవర్మ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఆయన.. చంద్రబాబుతో జోగి రమేశ్‌ మాట్లాడేందుకు వచ్చారని డీఐజీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబుతో మాట్లాడడానికి జోగి రమేశ్‌కు ఉన్న అర్హత ఏంటని నిలదీశారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ లేకుండా ఎలా కలుస్తారన్నార వెంకన్న ప్రశ్నించారు. డీఐజీ స్థాయి వ్యక్తి పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారని, తప్పు చేసే పోలీసులను కోర్టు బోనులో నిలబెడతామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

చంద్రబాబు ఇంటిపై జరిగింది దాడి కాదని చిత్రీకరించడానికి ముగ్గురు ఐపీఎస్‌లు తాపత్రయం చెందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ నేరుగా ఇది ఆరంభం మాత్రమే అని ప్రకటన చేశారని.. కానీ, గుంటూరు డిఐజీ , ఎస్పీలు నిస్సీగ్గుగా ప్రకటనలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. పోలీసు, ఐపీఎస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా కొంత మంది పని చేస్తున్నారని తెలిపారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తాము కూడా అధికారం చేపట్టామని… ఏ రోజు పోలీసు వ్యవస్థను ఇంత నీచంగా వాడుకోలేదన్నారు.బాధితులు తమ గోడు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాజ్యాంగాన్ని రోజు రోజుకు తూట్లు పొడుస్తున్నారని నక్కా ఆనంద బాబు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు తమ బాధ్యతలు విస్మరించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర. పోలీసులు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. వైసీపీ నేతలతో పోలీసులు కుట్ర పన్ని చంద్రబాబు ఇంటిపై దాడి చేయించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. సీతానగరం గ్యాంగ్ రేప్ ఘటనలో ఇంకా నిందితులను పూర్తిగా పట్టుకోలేదన్న ఆయన.. పాలడుగు సామూహిక అత్యాచారం జరిగి రెండు వారాలు గడుస్తున్న చర్యలు శూన్యమన్నారు. గుంటూరు జిల్లాలో పోలీసులు అధికారి పార్టీ నేతలకు దాసోహం అయ్యారని ఆరోపించారు. గుంటూరులో అక్రమ వ్యాపారాలను కాదని, విపక్షనేతలపై తప్పడు కేసులు పెడుతున్నారని నరేంద్ర మండిపడ్డారు.

Read Also…  Millet Benefits: తాతముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణధాన్యాలు.. వీటిని తినడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా ..