ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ అమోదం తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీని అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. నూతన మద్యం పాలసీ ఎలా ఉండబోతోంది..? గతంలోలాగా మద్యం షాపులకు టెండర్లు పిలుస్తారా? గైడ్‌లైన్స్ ఎప్పటిలోగా రిలీజ్ చేసే అవకాశం..? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఇదే..!
నూతన మద్యం పాలసీని తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. 2014 – 2024 మధ్య ఎక్సైజ్ పాలసీల మధ్య తేడా, ఎలా ముందుకు వెళ్ళాలన్న దానిపై రాష్ట్ర కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్‌వర్క్ లోపభూయిష్టంగా లేకుండా, పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పర్యవేక్షణలో అంతరాలు, విఫలమైన ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణం, నేరాలు, ఆదాయ నష్టాల పెరుగుదలకు దారి తీశాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల మద్యం పాలసీల అధ్యయనానికి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలోనే రానున్న నెలన్నర రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం క్రిందకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరింది. ప్రస్తుతం ఉన్న ఎస్ఈబీని రద్దు చేసి, ఎక్సైజ్ లో కలిపే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.
మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణ విధానాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. మంత్రివర్గం తుది ఆమోదానికి ముందు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 5, 2024 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి, 1 అక్టోబర్, 2024 నుండి కొత్త మద్యం విధానం అమలు చేయాలన్నది ఏపీ సర్కార్ లక్ష్యంగా ఉంది. కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు అవకాశం కలుగుతుందని కేబినెట్ అంశాలను వివరించిన మంత్రి పార్థసారథి తెలిపారు.
రానున్న 60-65 రోజుల్లో మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పారదర్శకంగా మద్యం సేకరణ విధానాన్ని ఆటోమేటెడ్ సిస్టం క్రింద అందుబాటులోకి తీసుకురానున్నామని అంతేకాక, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) మార్గదర్శకాలకు అనుగుణంగా కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి పర్థసారథి వివరించారు. అక్రమ మద్యం నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న డీ-అడిక్షన్, రిహాబీటేషన్ విధానాన్ని అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలో కూడా సమర్థవంతంగా ఆ కేంద్రాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా అమలవుతోన్న ఉత్తమ విధానాలను తెలుసుకోవడానికి ఈ అధ్యయన బృందాలు పర్యటిస్తున్నాయి.
2019-24లో గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అస్తవ్యస్తం చేయడంతో చాలా దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయని మంత్రి పార్థసారధి తెలిపారు. ముఖ్యంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలు 232 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు 436 లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18,860 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఆ సమయంలో సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు మద్యం అమ్మకాల్లో అన్నివిధాలుగా లబ్ధి పొందాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక, గత ప్రభుత్వం మద్యం అమ్మకాల సప్లై చైన్ ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు గుత్తాధిపత్యం చెలాయించిందని, వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు, జాతీయ స్థాయి ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని మార్కెట్ లో అందుబాటులో లేకుండా చేసిందని, నాణ్యత లేని మద్యం అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావం చూపించిందని మంత్రి పార్థసారధి తెలిపారు.
ఇప్పటికీ చాలా చోట్ల మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు తక్కువగా జరుగుతున్నాయి. తక్కువ ధరకు లభించే మద్యం మాయమైంది. డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. దీంతో వీటన్నింటి భాగస్వామ్యంతో కొత్త పాలసీ రాబోతోందని రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారధి వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..