శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతిలో మరో అద్భుత కట్టడం.. ఇది కదా కావాల్సింది
తిరుపతిలో మరో అద్భుత కట్టడం రాబోతోంది. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్, డీపీఆర్ సిద్దం చేయగా.. సీఎం ఆమోదం తెలిపితే అధునాతన కట్టడాలతో 10 అంతస్తుల..
తిరుపతిలో మరో అద్భుత కట్టడం రాబోతోంది. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్, డీపీఆర్ సిద్దం చేయగా.. సీఎం ఆమోదం తెలిపితే అధునాతన కట్టడాలతో 10 అంతస్తుల బస్ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. టెంపుల్ సిటీ తిరుపతికి వచ్చే భక్తులకు, యాత్రికులకు ఇంటిగ్రేటెడ్ బస్సు టర్మినల్ అందుబాటులోకి రాబోతుంది. 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రస్తుతం 66 ప్లాట్‌ఫామ్‌లుండగా.. దాదాపు 1.60 లక్షల మంది దాకా యాత్రికుల రాకపోకలు రోజువారీగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే యాత్రికులు, భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్‌ను మరిన్ని కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే కార్యరూపం దాల్చని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి ఎట్టకేలకు సాకారం అవుతోంది.
తిరుపతి ఎంపీ గురుమూర్తి పట్టుదల ఎట్టకేలకు ఫలించబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. బస్ టెర్మినల్ డిజైన్లను సిద్ధం చేసింది. ఇక సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగానే ఎన్‌హెచ్‌ఎం సీఈఓ ప్రకాష్ గౌర్ నేతృత్వంలో కమిటీ తిరుపతి రైల్వే స్టేషన్‌ను పరిశీలించింది. ఎంపీ గురుమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజ మిశ్రా ఆర్టీసీ అధికారులతో సమావేశం జరిపారు. ప్రయాణికులకు కల్పించే సదుపాయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్ళు, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫాంలు, కార్యాలయాలు, ఎంట్రెన్స్ ఎగ్జిట్ పాయింట్స్, నలువైపులా ఉన్న రహదారులు, పారిశుధ్యం, విద్యుత్ సౌకర్యం, ప్రైవేట్ వాహనాల పార్కింగ్, బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్‌కు జాయింట్ బ్రిడ్జి, అండర్ పాసింగ్ తదితర అంశాలపై చర్చించారు. దాదాపు రూ. 500 కోట్లతో జీ-ప్లస్ 10 అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
దీంతో అద్భుత కట్టడంగా మారిపోనున్న ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల రీఛార్జింగ్ కేంద్రాలు కూడా రాబోతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఎంట్రన్స్, ఎగ్జిట్ ఏర్పాటుతో పాటు అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మినీ గ్యారేజ్ ఏర్పాటు చేయాలని డిజైన్స్ సిద్ధం చేసిన కేంద్రం.. వచ్చే 30 ఏళ్ల వరకు సమస్య లేకుండా నిత్యం 5 వేల బస్సుల రాకపోకలు, రెండున్నర లక్షల మంది ప్రయాణికుల సందర్శనకు అనుకూలంగా నిర్మాణాలు ఉండాలని డిపిఆర్ సిద్ధం చేసింది.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భవనాన్ని దశలవారీగా మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుపతి శివారు ప్రాంతాల్లో డిపోలు గ్యారేజీలు ఉండాలని సూచించిన ఎన్‌హెచ్‌ఏఎం కమిటీ మునిసిపల్, తుడా, పొల్యూషన్, ఫైర్, విమానయాన, విద్యుత్ విభాగాలకు సంప్రదించి అనుమతులు ఇప్పించాలని కోరింది. వారం వ్యవధిలోనే ఆర్టీసీ అధికారులు, ఎంపీ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. బస్టాండుకు ఆగ్నేయంలో ఉన్న ప్రైవేటు స్థలం సమస్యను కొలిక్కి తేవాలని ఎంపీని కోరింది కమిటీ. ఇక 21 ఛార్జింగ్ పాయింట్లతో విద్యుత్ సౌకర్యం అందించాలని నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ నుంచి 22.1 కిలోమీటర్ వరకు తిరుమలకు నేరుగా రోడ్డు సౌకర్యం, రైల్వే స్టేషన్‌కి 800 మీటర్ల స్కైవే, 16.8 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రహదారుల సౌకర్యం ఉండేలా డిజైన్లు సిద్ధమయ్యాయి.
ఇక ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌పై హెలి అంబులెన్స్ రాకపోకలు వీలుగా హెలిప్యాడ్ కూడా రాబోతోంది. మరోవైపు థియేటర్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్‌లో రాబోతున్నాయి. నాలుగు బస్సు టర్మినల్స్, బస్టాండ్‌కు నాలుగువైపులా ప్రధాన రోడ్లు, సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు స్కైవే పేరుతో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని డిజైన్ చేసింది కమిటీ. కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశంతో కమిటీ అధికారులు బస్టాండ్‌ను పరిశీలించారు. గత ఏడాది కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా డిజైన్స్‌ను ఆమోదించి టెండర్లు పిలవాలన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఇక ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్ డిజైన్స్‌పై త్వరలో సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నామన్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామంటున్నారు.