ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దిశ యాప్, నెల్లూరు జిల్లాలో యువతిని ఆటో డ్రైవర్ బారి నుంచి కాపాడింది. ఆటో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంటనే మొబైల్‌లోని దిశ యాప్ ఎస్‌ఓఎస్ బటన్ ఆన్ చేయడంతో కేవలం రెండు నిమిషాల్లోనే పోలీసులు యువతి వద్దకు వచ్చి ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చారు. యువతిని క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులను గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ అభినందించారు. ఆయనే కాదు నెల్లూరు జిల్లా ప్రజలు సైతం పోలీసుల సేవలను కొనియాడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే… నెల్లూరు జిల్లా దొరవారిసత్రం పోలీసులు, దిశ యాప్ సాయం కోరిన యువతిని క్షేమంగా ఇంటికి చేర్చారు. సూళ్లూరుపేట సమీపంలోని శ్రీసిటీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి సొంత ఊరు మార్కాపురం వెళ్లి తిరిగి వస్తుండగా నాయుడుపేట నుంచి సూళ్లూరుపేట వెళ్లేందుకు రాత్రి పదిన్నర సమయంలో హైవేపై వెళ్తున్న ఆటో ఎక్కింది. అయితే ఆటో బయలుదేరిన కాసేపటికే డ్రైవర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనుమానం రావడంతో దిశ యాప్‌లో ఎస్‌ఓఎస్ బటన్ ఆన్ చేసింది ఆ యువతి. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. 10.38 గంటలకు సమాచారం అందుకుని 10.40 గంటలకు బాధిత యువతితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారిసత్రం పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది 10.42 గంటలకు యువతి వద్దకు చేరుకుని ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని సురక్షితంగా సూళ్లూరుపేట తీసుకొచ్చి బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు హైవేలో ప్రయాణిస్తున్న ఆటో వద్దకు చేరుకుని యువతిని క్షేమంగా ఇంటికి చేర్చారు. దిశ యాప్ ఉపయోగాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలని, అలాగే ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ. మహిళలు ఎవరు అధైర్య పడొద్దని, మహిళలకు పోలీసులు ఎప్పుడు అండగా ఉంటారని ఉద్ఘాటించారు. అటు ప్రభుత్వం కూడా దిశ యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ప్రతీ యువతి, మహిళ దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది.
Also Read:తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కీలక హెచ్చరిక చేసిన టీటీడీ