Nandyal: ఆలయ్య ఈఓ, ప్రధాన పూజారే దొంగలు.. వెంకన్న నగలే కాజేశారు.. నాశనమైపోతారు..

వెంకటేశ్వర స్వామి ఆలయంలో తీవ్ర అపచారం వెలుగుచూసింది. ఆలయ ఈవో, ప్రధాన అర్చకుడు కుమ్మక్కై స్వామివారి వెండి ఆభరణాలను అమ్ముకున్న ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపుతోంది. పోలీసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పూర్తి వివరాలు కథనం లోపల ..

Nandyal: ఆలయ్య ఈఓ, ప్రధాన పూజారే దొంగలు.. వెంకన్న నగలే కాజేశారు.. నాశనమైపోతారు..
Temple Ornaments Theft

Edited By:

Updated on: Jan 04, 2026 | 8:19 AM

నంద్యాల జిల్లాలో తీవ్ర అపచారం చోటు చేసుకుంది. ఆలయ అధికారి, ప్రధాన అర్చకుడు కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి ఆభరణాలను అమ్ముకున్న ఘటన పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో దశాబ్దాల క్రితం గ్రామస్తులంతా కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయంలో స్వామివారికి వెండి కిరీటం, శంఖు–చక్రాలు, పాదపద్మాలు తదితర ఆభరణాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో చేయించారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆభరణాలతో స్వామివారిని అలంకరించి దర్శించుకునే ఆనవాయితీ ఉంది. ఈ ఆభరణాలన్నీ ఆలయ అధికారి, ప్రధాన అర్చకుడు కిషోర్ శర్మ సంరక్షణలో ఉండేవి. అయితే ఈ ఏడాది జూలై నెలలో అప్పటి ఈవో నరసయ్య బదిలీ అనంతరం పదవీ విరమణ పొందాడు. కొత్త ఈవోగా జయచంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టారు. కానీ రిటైర్ అయిన ఈవో నరసయ్య, ఆభరణాల వివరాలు గానీ, లెక్కలు గానీ కొత్త ఈవోకు అప్పగించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఈవో జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు.

ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆభరణాల విషయంలో పెద్ద చర్చ జరిగింది. గ్రామస్తులకు తెలియకుండా నకిలీ ఆభరణాలకు వెండి తాపడం చేయించి స్వామివారికి అలంకరించినట్లు వెలుగులోకి వచ్చింది. కిరీటం సహా ఆభరణాల్లో స్పష్టమైన తేడాలు కనిపించడంతో గ్రామస్తులు ప్రశ్నించగా, పూజారి సమాధానాలు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గ్రామస్తులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒరిజినల్ ఆభరణాలు, డూప్లికేట్ ఆభరణాలను పోల్చి చూపిస్తూ పోలీసులకు ఆధారాలు సమర్పించారు.

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వర స్వామికి చెందిన వెండి ఆభరణాలను ఆళ్లగడ్డకు చెందిన ఓ వెండి వ్యాపారి వద్ద విక్రయించినట్లు గుర్తించారు. ఆభరణాల బరువు 10 నుంచి 15 కిలోల వరకు ఉండొచ్చని సమాచారం. ఈ వ్యవహారంలో మాజీ ఈవో నరసయ్య, ప్రధాన అర్చకుడు కిషోర్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇద్దరూ కలిసి స్వామివారి ఆభరణాలను విక్రయించినట్లు తేలినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ వెల్లడించారు.

ఇదే ఆలయానికి సమీపంలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత గల పుట్టాలమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన ఆభరణాలు కూడా మాయమైనట్లు సమాచారం. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అనేక దేవాలయాలకు చెందిన ఆభరణాలు చోరీకి గురైనట్లు దేవదాయ శాఖకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు దేవదాయ శాఖ ఉద్యోగుల ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వ్యవహారం బయటకు రాకుండా గుట్టుగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..