
వివాహేతర సంబంధానికి భర్త అడ్డంగా ఉన్నడని భావించిన భార్య.. కూతురుని ఇచ్చి వివాహం చేసిన అల్లుడుతో కలసి భర్తను చంపిన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల శివారులోని నందమూరి నగర్ లో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. నంద్యాల శివారులోని నందమూరి నగర్ లో గుర్రప్ప, సుభద్రా దంపతులకు ముగ్గరు కుమార్తెలు.. గుర్రప్ప పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ముగ్గురు అమ్మాయిలలో పెద్ద కూతురైన పౌర్ణమిని రుద్రవరం మండలం తూపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యకు ఇచ్చి పెద్దల సమక్షంలో ఐదు నెలల క్రితం వివాహం జరిపించారు.
పెద్ద కూతురు భర్త అయిన లింగమయ్యతో అత్త సుభద్ర చనువుగా ఉండటంతో ఇది నచ్చక భర్త గుర్రప్ప తరుచు గొడవ పడేవాడు. భర్త తీరు నచ్చక భార్య సుభద్రా, అల్లుడు లింగమయ్యతో కలిసి భర్తను చంపాలని పథకం రచించింది..
అందులో భాగంగా 17వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోయిన గుర్రప్పను.. ఇదే సరైన సమయం అని భావించింది భార్య సుభద్రా. వెంటనే అల్లుడు లింగమయ్య కు సమాచారం ఇచ్చింది.ఇంటికి వచ్చిన లింగమయ్య ఇంట్లో స్పీకర్ వైర్లతో గుర్రప్ప మెడకు బిగించాడు. గుర్రప్ప కదలకుండా కాళ్ళను తాడుతో బిగించింది భార్య సుభద్రా.
తమ కళ్ళ ముందే కన్న తండ్రిని తల్లి చంపడాన్ని చూసి ఇద్దరు కూతుర్లు తల్లడిల్లి పోయారు. ఈ ఘటన అడ్డుకోబొయిన ఇద్దరు కూతుళ్లను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ పెద్దక్క ను కూడా చంపుతాం అని బెదిరించారు. దీంతో ఇద్దరు పిల్లలు సైలెంట్ గా ఉండి పోయారు. గుర్రప్ప చనిపోయాడు అని నిర్దారించుకున్న భార్య, అల్లుడు .. సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
గుర్రప్ప మెడపై ఉన్న గాయాలను చూసి చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గుర్రప్ప మృతి హత్య గా నిర్థారించారు. కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు బయటపడ్డాయి. వెంటనే సుభద్ర ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
జరిగిన హత్యను ప్రత్యక్షంగా చూసిన గుర్రప్ప, సుభద్రా దంపతుల ఇద్దరు కూతుర్లు వివరంగా చెప్పారు. రాత్రి పదగొండు గంటల సమయంలో తమ తండ్రిని చంపారని.. చనిపోయిన తండ్రి ఎదుటనే కూర్చోని ఎవరికి ఎం చెప్పాలో తెలియ లేదని అవేదన వ్యక్తం చేశారు.
గుర్రప్ప మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నాడనే నెపంతోనే భార్య, అల్లుడు తో కలిసి భర్తను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..