ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. వెండితెరపై ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ ఎన్నో చేశారని.. ట్రెండ్ సెట్టర్‌గా.. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా ఆయన ఎదిగారని బాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో పాటు సంక్షేమ పాలనతోనూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని బాలకృష్ణ అన్నారు. తెలుగువాళ్లను మద్రాసియులు అని పిలవబడుతున్న సమయంలో తెలుగుజాతి గొంతు ఎత్తి చాటిన మహనీయులు ఎన్టీఆర్ అని తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో ఎన్టీఆర్ వెలుగులు నింపారని అన్నారు. ఆయన శారీరకంగా మన ముందు లేకపోయినా.. ఆయన కీర్తి మాత్రం ఎల్లప్పుడూ మన ముందే ఉంటుందని బాలకృష్ణ పేర్కొన్నారు.