వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని ప్రకటన చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పోలవరం విషయంలో ప్రభుత్వ చర్యలు కేవలం రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన పార్టీ పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును 41.15 కు మొదటి దశలో పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా.. అని ప్రశ్నించారు. వచ్చే నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారని, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించి పక్కా సమాచారంతో వాస్తవాలు ప్రజల ముందు పెడతామన్నారు. అదే రోజు సాయంత్రం కొవ్వూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేసిందో తెలియజేస్తామని వివరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
రాష్ట్ర విభజన సందర్భంలో మన జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో గొప్ప ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 660 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అంకితభావంతో పని చేసే మన రైతులు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకంటే ముందుంచుతారని నమ్మారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయని చెప్పారు. అవన్నీ ప్రజల ముందు పెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే ప్రాజెక్టు మరమత్తు కోసం 2,030 కోట్ల రూపాయలు పోలవరం అధారిటీ నుండి సాంక్షన్ రాకపోయినా జీవో విడుదల చేయడం అవినీతి కాదా..పోలవరం పూర్తయిపోతుందని మభ్యపెట్టడాన్ని ముక్తకంఠంతోటి ఖండించాలన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు లక్ష ఉంటే ఈ ప్రభుత్వం 24 వేల మందికి రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ముంపు ప్రాంతాల ప్రజలు వరదల సమయంలో ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక అల్లాడుతున్నారు. 11 రోజుల పాటు ఆ ప్రాంతాల్లో కరెంటు లేదు. జనసేన పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించి పార్టీ తరఫున సహాయం చేసి అండగా నిలిచారు. శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం ముంపు ప్రాంతాల పరిధిపై ఉమ్మడి సర్వే చేయమంటే ఎందుకు చేయడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా పాటించకుండా ఎందుకు అబద్దాలు చెబుతున్నారు. గత ఖరీఫ్ కే సాగునీరు ఇస్తామన్నారెక్కడ? ఎంతసేపు విపక్షాల మీద విమర్శలు చేయడం.. ఈ మధ్య కొత్తగా పిట్టకథలు వల్లివేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు.
ముఖ్యమంత్రికి నిజంగా నిజాయితీ ఉంటే ప్రతి బిడ్డ సత్య నాదెళ్ల కావాలన్న కోరిక ఉంటే బైజూస్ పేరిట రూ. 700 కోట్ల స్కామ్ చేస్తారా? ఈ ముఖ్యమంత్రికి సమర్ధత లేదు. పరిపాలనా దక్షత లేదు. జనసేన పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం అవసరం అయితే కేంద్రం బాధ్యత తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. డ్యామ్ నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తుంది. ప్రతిపక్ష ఓటు చీలకుండా నిజాయితీగా ప్రయత్నం చేస్తాం. దానికి అనుగుణంగానే పరిణామాలు ఉంటాయి. మన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ ఎన్నికలు.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వైసీపీని ఇంటికి పంపాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..