Janasena: “సీఎం గాల్లో ప్రయాణిస్తుంటే… హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి?”

|

May 03, 2023 | 7:26 PM

విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం గాల్లో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు నిలిపివేశారంటూ ఆరోపించింది జనసేన. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Janasena: సీఎం గాల్లో ప్రయాణిస్తుంటే...  హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి?
Cm Jagan - Pawan Kalyan
Follow us on

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల వార్ నడుస్తుంది. పలు అంశాలపై ఒకరిపై ఒకరు అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జగన్ పర్యటనపై  తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రి  జగన్ రెడ్డికి హైవే మీద వాహనాలు ఏ విధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదంటూ పంచ్‌లు పేల్చారు.

“ఈ రోజు విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన కోసం శ్రీ జగన్ రెడ్డి గాల్లో ప్రయాణించి వెళ్తే అటు శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర, ఇటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయడం విచిత్రంగా ఉంది. గంటల తరబడి వాహనాలు ఆపివేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి చర్యలు చూస్తుంటే ముఖ్యమంత్రి రోజురోజుకీ అభద్రతాభావం పెరిగిపోతోంది. పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్టగా భోగాపురానికి అటూయిటూ 150 కి.మీ. దూరాన హైవేపై వాహనాలు ఆపివేయడం. దీనివల్ల సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. సీఎం భోగాపురం పర్యటన నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు శ్రీమతి తుమ్మి లక్ష్మీరాజ్, శ్రీమతి పతివాడ కృష్ణవేణి, శ్రీ పతివాడ అచ్చన్నాయుడు,శ్రీ కారి అప్పలరాజు తదితరులను అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం అప్రజాస్వామికం. ఈ అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నాం”  అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..