AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కొండ గ్రామంలో వింత వ్యాధి.. వరుస మరణాలతో ఉలిక్కిపాటు..!

ఏజెన్సీ గ్రామాల్లో ఒక్కోసారి తలెత్తే పరిస్థితులు అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి. ఆకస్మికంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయ్. కారణాలు తెలియవు. సీరియల్ మరణాలతో ఆ ప్రాంతం అంతా స్మశాన వాతావరణం అలుముకుంటుంటుంది. విచిత్రంగా మరణించే వాళ్లందరి అనారోగ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి. దీంతో అదేదో మాయ రోగం అనుకుంటారు గిరిపుత్రులు. లేదంటే దెయ్యం పట్టిందని అనుకుంటుంటారు.

ఆ కొండ గ్రామంలో వింత వ్యాధి.. వరుస మరణాలతో ఉలిక్కిపాటు..!
Vizag Agency Areas
Eswar Chennupalli
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 21, 2023 | 9:25 PM

Share

ఏజెన్సీ గ్రామాల్లో ఒక్కోసారి తలెత్తే పరిస్థితులు అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి. ఆకస్మికంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయ్. కారణాలు తెలియవు. సీరియల్ మరణాలతో ఆ ప్రాంతం అంతా స్మశాన వాతావరణం అలుముకుంటుంటుంది. విచిత్రంగా మరణించే వాళ్లందరి అనారోగ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి. దీంతో అదేదో మాయ రోగం అనుకుంటారు గిరిపుత్రులు. లేదంటే దెయ్యం పట్టిందని అనుకుంటుంటారు. అలాంటి ఘటనే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. అరకు లోయ మొత్తాన్ని భయాందోళనకు గురి చేస్తోన్న ఈ మాయరోగం లోతేరు పంచాయతీ దూది కొండి గ్రామంలో జరిగింది. గత రెండు రోజుల వ్యవధిలో ఆ కుగ్రామంలో ముగ్గురు మృతి చెందారు. వాళ్లేమి పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా కాదు, అందరూ 50 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే.

విచిత్రంగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలతో..

ఆ గ్రామంలో మొత్తం ఉండేది 12 ఇల్లే. మొత్తం జనాభా ఉండేది 34 మంది మాత్రమే. వారిలో గత రెండు రోజుల వ్యవధిలో ఆ గ్రామానికి చెందిన ముగ్గురు సమర్ధి బాబురావు ,కోడపల్లి బంగారమ్మ, కుర్ర రమేష్ లు మృతి చెందడం తో గ్రామం మొత్తం షాక్ కు గురైంది. వారంతా రాత్రి అన్నం తిన్నాక నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కడుపు నొప్పి రావడం, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారడం, గ్రామం లో వైద్య సదుపాయాలు లేకపోవడంతో హాస్పిటల్ కు తరలించే లోపే చచ్చిపోవడంతో గ్రామం తల్లడిల్లిపోయింది.

వింత వ్యాధి ప్రభావమా? దెయ్యం పట్టిందన్న అనుమానంలో గ్రామస్థులు..

సాధారణంగా ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా అనారోగ్యం పాలైతే గిరి పుత్రులు హాస్పిటల్స్ కి వెళ్లడం చాలా అరుదు. స్థానికంగా లభించే ఆకుపసురులాంటివి తీసుకోవడం, లేదంటే దిష్టి తీయించుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే ఆ గ్రామానికి ఏదైనా దయ్యం పట్టిందేమో అన్న అనుమానంతో మాంత్రికులని, తాంత్రికలను గ్రామానికి తీసుకువచ్చి క్షుద్ర పూజలు చేయిస్తుంటారు. అవి ఆ గ్రామ ఆచారాలు కూడా. అలా ఆ కట్టుబాట్లు తప్పిన సమయంలో ఇలాంటి మరణాలు సంభవిస్తుంటాయని అలా ఏమైనా జరిగిందేమో అన్న ఆందోళన కూడా గ్రామస్తులలో ఉంది. మరొకవైపు ఇంకా ఏదైనా మాయరోగం సోకిందేమో అన్న ఆందోళన కూడా వారిలో నెలకొంది. దీనికి హాస్పిటల్స్ కి వెళ్లడం కంటే కూడా శాంతి చేయించాలన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉండడం మరొక విషాదం..

ప్రస్తుతం లోతేరు పంచాయతీ పరిధిలోని దూది కొండి గ్రామాన్ని కూడా ఏదో వింత వ్యాధి పట్టుకుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మరణాలు ఆ నోటా ఈ నోటా పడి అది మండలం అంతా పాకింది. దాంతో ఏజెన్సీ మొత్తం ఆ గ్రామానికి దెయ్యం పట్టిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయం అందరిలో చర్చనీయాంశం అయింది. దీంతో అలెర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వైద్య సిబ్బంది మాత్రం దీర్ఘకాలిక అనారోగ్యం తోనే మృతి చెందినట్టు ప్రాథమిక నిర్దారణ కు వచ్చినట్లు చెబుతున్నారు. మరొక వైపు తదుపరి మరణం ఎవరికి ఉండబోతుందో అంటూ గ్రామస్తులు బిక్కు బిక్కు మంటూ గడుపుతూ ఉండడం ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.