Vizag: సీఎం జగన్ విశాఖ షిఫ్టింగ్‌కు ముహూర్తం ఫిక్స్.! ఇంతకీ ఎప్పుడంటే.?
CM YS Jagan Vizag Shifting: సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖకు తరలించే విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముహూర్తాలు మారితే మారొచ్చు.. నిర్ణయంలో మాత్రం మార్పు లేదు అనేది ప్రభుత్వ వాదన. ఛలో విశాఖ తాజా ముహూర్తం డిసెంబర్ 17. ఆ దిశగా ఏర్పాట్లు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి.

సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖకు తరలించే విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నారట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముహూర్తాలు మారితే మారొచ్చు.. నిర్ణయంలో మాత్రం మార్పు లేదు అనేది ప్రభుత్వ వాదన. ఛలో విశాఖ తాజా ముహూర్తం డిసెంబర్ 17. ఆ దిశగా ఏర్పాట్లు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయని సమాచారం.
తాడేపల్లి టు విశాఖపట్నం.. అక్టోబర్ కాకపోతే డిసెంబర్.. క్యాంపాఫీసు కేరాఫ్ మార్చడం వంద శాతం ఖరారైందని తెలుస్తోంది. ఇటీవల ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్రారంభ కార్యక్రమంలో కూడా సీఎం జగన్ ఈ మేరకు మరింత స్పష్టత కూడా ఇచ్చేశారు. ఆ మేరకు డిసెంబర్ చివరి వారంలో విశాఖలో మకాం పెట్టడానికి సిద్ధమయ్యారట. ఈసారి ముహూర్తం స్వామి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా జరిగిందట. అందుకే.. ఈ నిర్ణయంలో మార్పు లేదు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎప్పుడు నిర్మాణాలు పూర్తయితే అప్పుడు విశాఖకు రావాలని సీఎం జగన్ సమాయత్తంగా ఉన్నారని సమాచారం. ఆరేడు నెలలుగా యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారట.
దసరాకు పక్కా అనుకున్నా..!
మొదట్లో అక్టోబర్ 24.. విజయదశమికి పక్కా అనుకున్నారు. భవన నిర్మాణ పనుల్ని టూరిజం, పట్టణాభివృద్ధి శాఖలు నేరుగా పర్యవేక్షిస్తున్నా.. ఇప్పటివరకు 20 పర్సెంట్ పనులు పెండింగ్‌లోనే ఉండిపోయాయట. దసరాకి కనీసం గృహప్రవేశం చేసి లాంచనాలు ముగించాలని కూడా ప్రతిపాదన ఉంది. కానీ ఒక్కసారి గృహప్రవేశం చేశాక.. అక్కడే బస ఉండకుండా గ్యాప్ ఇస్తే జనంలోకి రాంగ్ సిగ్నల్ వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే దసరా ముహూర్తాన్ని డ్రాప్ చేశారట.
స్వరూపానంద సలహా మేరకే..
విజయదశమి కాకపోతే డిసెంబర్ 17 నాడు ముహూర్తం బాగుందని స్వరూపానందేంద్ర స్వామి సూచించారట. ఆలోగా నిర్మాణ పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన, కీలక కార్యక్రమాలకు ముహూర్తాల కోసం ఆయన్నే ఆశ్రయించి, ఆయన సలహాల మేరకే ముందుకెళ్లడం జగన్ అలవాటు అని జనం చెప్పుకుంటారు. ఇటీవల విజయవాడలో జరిగిన యాగంలో పూర్ణాతి కోసం స్వామివారినే పిలిపించారట. ప్రభుత్వంలో కీలక అధికారి ఒకరు స్వయంగా వెళ్లి స్వరూపానందేంద్రను కలిసి క్యాంపాఫీసు మార్పిడికి ముహూర్తం కోసం సంప్రదించినట్టు సమాచారం. ఆ ప్రకారమే.. డిసెంబర్ 17 ఖరారైనట్టు తెలుస్తోంది. విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాల్లో డిసెంబర్ 17న గృహప్రవేశం జరిగాక.. వెంటనే తిరిగి వెళ్లకుండా వారం రోజుల పాటు అక్కడే బస ఉండేలా ఏర్పాటు జరిగిందట. తర్వాత పల్లె నిద్రలు, రాష్ట్ర పర్యటనలు విశాఖ కేంద్రంగానే జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల వరకు తాడేపల్లిని వెకేట్ చెయ్యకుండా.. అవసరాన్ని బట్టి రెండు క్యాంపాఫీసుల్ని వాడేలా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
