AP News: ఏపీ క్యాబినెట్లో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక నిర్ణయం.. మంత్రి వేణుగోపాల్ వెల్లడి
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన ఈ మంత్రివర్గ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ క్యాబినెట్ భేటి ఆసక్తిని సంతరించుకుంది.
అమరావతి, జనవరి 31: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన ఈ మంత్రివర్గ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ క్యాబినెట్ భేటి ఆసక్తిని సంతరించుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఫిబ్రవరి 16 న వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 500 జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న గ్రామ పంచాయతీలకు గ్రేడ్ – 3 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. DSC – 2024 ద్వారా 6100 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు.
డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకూ 2,13,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గణాంకాలను వెలువరించారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 2,20,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. జపాన్,దక్షిణ కొరియాలో మాత్రమే ఉన్న IB విద్యను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పలు సంస్థలకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జాతర ఉండనున్నట్లు మంత్రి మాటల్లో అర్థమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..